logo

వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది.

Published : 03 Jul 2024 02:05 IST

లీజు పూర్తయినా గడువు పొడిగింపు
రద్దు చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం
పారిశ్రామిక ప్రాంతంలో అడ్డగోలుగా గనుల తవ్వకాలు

ఈనాడు-తిరుపతి: నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. పరిశ్రమలు స్థాపిస్తాం.. నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తామంటూ గొప్పలు పోతూనే పారిశ్రామిక ప్రాంతాల్లో గోతులు తవ్వేందుకు అనుమతిచ్చింది. విశాఖ-చెన్నై పారిశ్రామికవాడలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుర్తించిన స్టార్టప్‌ ప్రాంతాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం మైనింగ్‌కు కట్టబెట్టింది. ఆపై గనుల లీజు పొడిగింపునకు మొగ్గు చూపింది. ఫలితంగా ఇప్పుడది పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా లేని ప్రాంతంగా మారింది. కూటమి ప్రభుత్వం గనుల లీజు పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేయకుంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
విశాఖ-చెన్నై పారిశ్రామికవాడను సుమారు 24 వేల ఎకరాల పరిధిలో ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అప్పటి తెదేపా ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. భూసేకరణ త్వరితగతంగా సాధ్యం కాదని గుర్తించి తొలుత స్టార్టప్‌ ఏరియా కింద కొంత సేకరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం రౌతుసూరమాల, గౌడమాల ప్రాంతాల్లో భూసేకరణ ప్రారంభించారు. గతంలో మైనింగ్‌ కార్యకలాపాలు సాగినా స్టార్టప్‌ ఏరియాగా గుర్తించిన తర్వాత నిలిపివేయాల్సి ఉంది. వైకాపా హయాంలో గనుల లీజు గడువు పొడిగించారు. ఇప్పటికే తొట్టంబేడు, రౌతుసూరమాల ప్రాంతాల్లోని స్టార్టప్‌ ఏరియా పరిధిలో 30 అడుగుల మేరకు గోతులు ఏర్పడ్డాయి.

మైనింగ్‌ కారణంగా ఏర్పడిన గోతులు

లేఖ రాసినా..

శ్రీకాళహస్తి నోడ్‌లోని దక్షిణ బ్లాక్‌ను స్టార్టప్‌ ఏరియాలో గనుల లీజులు పొడిగించవద్దని అప్పటి ఏపీఐఐసీ అధికారులు.. ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. నాటి ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండి చక్రం తిప్పిన మంత్రితో లీజు గడువు పొడిగించుకునేలా పైరవీలు చేశారు. ఇష్టానుసారం తవ్వుతుండటంతో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో గనుల లీజు రద్దు చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని