logo

వాస్తవాలు దాచి.. ఆస్త్రాలు కదిలించి..

రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు.

Published : 03 Jul 2024 01:55 IST

నాయుడుపేట రెవెన్యూ అధికారుల లీలలు

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలోపైసలు ముట్టజెబితే దస్త్రాల్లో మాయ చేసి, అంతా బాగనేలా పనిచేయగల ఘటికులున్నారు. అందినకాడికి దండుకుని, ఇష్టానుసారం దస్త్రాలను సర్దేశారు. ఏకంగా సంయుక్త కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలను దాచి, దస్త్రాలు కదిలించి చేతివాటం చూపిన ఘటన వెలుగులోకి వచ్చింది.

నాయుడుపేట మండలం బీరదవాడ రెవెన్యూలో సర్వేనంబరు 112/3, 112/4లో 53.74 ఎకరాల భూమి ఉంది. సదరు విస్తీర్ణం వెలగలపూడి ప్రసాదరావు పేరిట పాస్‌పుస్తకాలు సైతం రెవెన్యూ అధికారులు మంజూరు చేసినట్లు తెలిసింది. వాటిని రద్దు చేయాలని వెలగలపూడి శైలజ.. నాయుడుపేట తహసీల్దార్‌కు గతేడాది జనవరి 4న వినతపత్రం సమర్పించారు. అప్పటి నుంచి ఇరువర్గాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వైకాపా నేత పాస్‌పుస్తకాలు రద్దు చేయకుండా పైరవీలు చేశారు. చివరకు దీనిపై సంయుక్త కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన దస్త్రాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి మార్చి 5న సదరు భూముల వివాదం కోర్టులో ఉందని, తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేమంటూ.. దస్త్రాల్లో వివాదాస్పద భూములుగా నమోదు చేయాలని తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి నుంచి మండల రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో సదరు భూముల్లో క్రయవిక్రయాలు జరిగినట్లు సమాచారం.

కొత్త దస్త్రంగా చేర్చి...

సంయుక్త కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చిన తర్వాత నాయుడుపేట మండల రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూముల జాబితాలో బీరదవాడ రెవెన్యూలోని 53.74 ఎకరాలను చేర్చలేదు.  సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉండిపోయారు. ఈలోగా మండల తహసీల్దార్లు బదిలీయ్యారు. కొత్తవారు విధుల్లో చేరారు. ఈ క్రమంలో వెలగలపూడి ప్రసాదరావు పేరిట ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయాలని ఫిబ్రవరిలో 5న వెలగలపూడి శైలజ వినతిపత్రం ఇచ్చినట్లు ఓ ఫైలు సిద్ధం చేశారు. దీంతోపాటు ఓ నోట్‌ఫైలు తయారు చేసి, సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయానికి కొద్ది రోజుల కిందట పంపారు.

ఆర్డీవో పసిగట్టి..

ఫిబ్రవరిలో శైలజ వినతిపత్రమిస్తే.. 147 రోజుల తర్వాత అంటే గత నెల 21న ఆర్డీవో కార్యాలయానికి సంబంధిత ఫైల్‌ను పంపారు. ప్రస్తుతం నాయుడుపేట తహసీల్దార్‌గా కల్యాణి పనిచేస్తున్నారు. కానీ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఫైలుపై ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ రాజేంద్ర సంతకం ఉన్నట్లు తెలిసింది. అన్ని ఫైళ్లతోపాటు బీరదవాడ భూ వివాదం ఫైల్‌ కూడా రావడంతో ఆర్డీవో చంద్రమునికి అనుమానం వచ్చింది. దీంతో పాటు ఫిబ్రవరి నెల వినతిప్రతం ఇప్పుడు పంపడాన్ని, తహసీల్దార్‌ సంతకం వేరొకలా ఉండటాన్ని గుర్తించి ఆరా తీశారు. సంయుక్త కలెక్టర్‌ ఈ ఏడాది మార్చి 5న ఆర్సీ.డీ2/428/2024 కింద ఉత్తర్వులిచ్చిన విషయం వెల్లడైంది. అందులో వివాదాస్పద భూముల జాబితాలో చేర్చాలని పేర్కొనట్లు కూడా గుర్తించారు. దీనిపై వెంటనే నాయుడుపేట రెవెన్యూ అధికారులను ఆర్డీవో ప్రశ్నించినట్లు సమాచారం.

అసోసియేషన్‌ నేతల ఒత్తిడి

ఆర్డీవో ప్రశ్నించడంతో సదరు ఉద్యోగ సంఘం నేతలు రంగంలోకి దిగారు. ఈ విషయం బయటకు రాకుండా చూడాలని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పంచాయితీ నడిపి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

ప్రశ్నించిన తర్వాత చేర్చారు

నాయుడుపేట తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పాత తేదీలతో కార్యాలయానికి దస్త్రం వచ్చిన మాట వాస్తవం. బీరదవాడలోని 53.74 ఎకరాలను వివాదాస్పద భూముల జాబితాలో చేర్చాలని జేసీ ఆదేశాలను అమలు చేయలేదు. దీనిపై ప్రశ్నించడంతో ప్రస్తుతం చేర్చారు.

చంద్రముని, ఆర్డీవో 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు