logo

చంద్రకాంతులు కురి‘పింఛెను’

రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది.

Published : 02 Jul 2024 03:32 IST

ఆనందోత్సాహాల్లో లబ్ధిదారులు
మొదటిరోజునే 95.67% నమోదు
రూ..174.49 కోట్ల పంపిణీ

నారాయణవనం: చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం  

తిరుపతి (బైరాగిపట్టెడ, భవానీనగర్, నగరపాలిక), న్యూస్‌టుడే: రోజంతా ఒకటే సందడి.. ఏ వీధి చూసినా.. ఏ పల్లె చూసినా సంక్షేమ సవ్వడి.. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పింఛనర్ల కళ్లలో.. వారి ఇళ్లలో అసలైన ఆనందం నింపింది. చెప్పినట్లు జులై ఒకటో తేదీన సూర్యోదయానే లబ్ధిదారుల గృహాల్లో వెలుగులు నింపింది. పెంచిన మొత్తం మూడునెలల బకాయి సహా అందించి  వారి జీవితాల్లో అసలైన సంక్షేమ భరోసాకు నాంది పలకడంతో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు. జిల్లా వ్యాప్తంగా 2,69,162 మంది లబ్ధిదారులు ఉండగా సోమవారం రాత్రి ఏడు గంటల వరకు 95.67% మందికి పింఛన్లు పంపిణీ చేశారు. వీరందరికీ ఎన్టీఆర్‌ సామాజిక భద్రత పింఛన్ల పథకం కింద రూ..174.49 కోట్లు సోమవారం పంపిణీ చేశారు మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.

కవితకు మొదటి పింఛన్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే ఆరణి, మేయర్‌ శిరీష తదితరులు

తిరుపతి నగరంలో ఉదయం 6:00 గంటలకు 35వ డివిజన్లోని భవానీ నగర్‌లో దివ్యాంగురాలైన పచ్చిపాల కవితకు మొదటగా పింఛను సొమ్మును అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కమిషనర్‌ అదితిసింగ్, మేయర్‌ శిరీష, పార్టీ నేతలు ఎన్‌వీ ప్రసాద్, మబ్బు దేవనారాయణ రెడ్డి, నరసింహ యాదవ్, పసుపులేటి హరిప్రసాద్, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేతలు, అధికారుల రాకతో భవాని నగర్‌లో పండగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది. 35వ డివిజన్‌ అంతటా మామిడి తోరణాలు, అరటి ఆకులతో అలంకరించారు. మేళతాళాలతో సంక్రాంతి వచ్చిందా అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు.

తొట్టంబేడులో పింఛన్‌ పంపిణీ చేస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తల్లి బృందమ్మ

మధ్యలో మొరాయించిన సర్వర్లు

ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ నిర్వహించారు. తర్వాత గంటన్నర పాటు సర్వర్లు మొరాయించాయి. దీంతో పింఛన్ల పంపిణీ కాస్త ఆలస్యంగా జరిగింది.

గూడూరు : పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌

వెంకటగిరి: డయాలసిస్‌ బాధితుడికి నగదు అందిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణ

తడ: కాదలూరులో పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ

తుమ్మలగుంటలో పింఛను పంపిణీ చేస్తున్న పులివర్తి నాని

తిరుపతి నగరంలో పెంచిన పింఛను తీసుకున్న లబ్ధిదారుల్లో ఆనందం

భవానీ నగర్‌లో సంగీత వాయిద్యాలతో స్వాగతం

సింగాలగుంటలో మంచానికే పరిమితమైన బాలకృష్ణయ్యకు పింఛను అందజేస్తున్న సిబ్బంది

నగరంలో మైనార్టీ మహిళ సంతోషం..


జీవితంలో మర్చిపోలేను

ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనిది. వేకువజామున ఐదున్నరకే మా ఇంటి తలుపులు తట్టారు. కళ్లు తెరిచిన వెంటనే నా చేతుల్లో పింఛను డబ్బులు పెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎక్కడికీ వెళ్లకుండా, ఎటువంటి అవస్థలు పడకుండా నేరుగా మా ఇంటికే పెంచిన పింఛను డబ్బును చేర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లించింది. కుటుంబమంతా ఆనందంగా ఉన్నాం.

పి.కవిత, దివ్యాంగురాలు


నెల సరకులు కొంటాం

వృద్ధాప్య పింఛన్‌ కింద బకాయితో కలిపి రూ.7వేలు అందింది. ఇంటికి వచ్చి పింఛను డబ్బులు అందించడం చాలా తృప్తినిచ్చింది. నెల మొత్తానికి సరిపడా సరకులు ఈ డబ్బుతో కొనుక్కొని తృప్తిగా మూడుపూటలా తింటాం. మా జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వానికి శతకోటి వందనాలు. 

ఆర్‌.కస్తూరి, మల్లయ్యగుంటకట్ట


ప్రసూతి ఆసుపత్రికెళ్లి అందజేత

తిరుపతి నగరపాలికలోని 39వ డివిజన్‌ పరిధిలోని చెన్నారెడ్డికాలనీకి చెందిన ప్రత్యేక ప్రతిభావంతురాలు కె.సుజాత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా సదరు వార్డు సచివాలయ పరిపాలన కార్యదర్శి పి.ప్రసూన అక్కడికి వెళ్లారు. ఆమెకు రూ.6 వేల పింఛను సొమ్మును అందజేశారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్న సమయంలో అవసరమైన ఖర్చులకు ఈ సొమ్ము ఎంతో ఉపయోగపడుతుందని సుజాత ఈ సందర్భంగా పేర్కొన్నారు.


వైద్య సేవలకు వినియోగించుకుంటా

పింఛను మాలాంటి పేదల జీవితాల్లో వెలుగునింపింది.  హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు రూ.4 వేలకు పెంచడంతోపాటు మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.7 అందించడం గొప్ప విషయం. నగదుతో బీపీ, మధుమేహానికి సంబంధించి వైద్యసేవలకు, కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటా.

డి.మునిరామిరెడ్డి, అక్కగార్ల కాలనీ


ఒకేసారి పెంచడం హర్షణీయం

గత ప్రభుత్వం ఏడాదికి రూ.250 చొప్పున పింఛను పెంచి ఇచ్చింది. తెదేపా ప్రభుత్వం ఏకంగా రూ.1000 పెంచడంతోపాటు అవ్వాతాతలకు బకాయితో కలిపి ఇంటివద్దకే ఇచ్చివెళ్లారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నిలపెట్టుకున్నారు. పింఛను నగదు వైద్యసేవలకు, ఇంటి ఖర్చులకు వెచ్చిస్తాం.

ఉషారాణి, చంద్రగిరి


జీవితంలో వెలుగు నింపారు

గతంలో వృద్ధాప్య పింఛను రూ.3 వేలు వచ్చేది. ఇటీవల వయసు మీదపడటంతో పక్షవాతం సోకి కుడికాలు, కుడిచేయి పడిపోయింది. నడవలేని పరిస్థితి. నాకు ప్రత్యేక కోటా కింద పింఛను ఇవ్వాలని విన్నవించా. నిబంధనల మేరకు ధ్రువపత్రం తీసుకురావాలని అధికారులు చెప్పారు. పెంచిన పింఛను  నగదు వైద్యసేవలకు సరిపోతుంది.

కృష్ణారెడ్డి, చంద్రగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని