logo

చంద్రకాంతులు కురి‘పింఛెను’.. వాడవాడలా సంబరాలు

పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు..

Updated : 02 Jul 2024 06:11 IST

మొదటి రోజే 95 శాతం పంపిణీ
లబ్ధిదారుల్లో సంతోషం
పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రనిధులు, నాయకులు

గోసులకురప్పల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: పల్లె, పట్టణం ఎక్కడ చూసినా సోమవారం పండుగలా కనిపించింది.. ఉషోదయ వేళ పింఛనుదారుల ఇంటి తలుపుతట్టి మరీ ప్రజాప్రతినిధులు పెంచిన పింఛను నగదు అందజేశారు.. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛనుదారులకు స్థానికంగానే పింఛను పంపిణీ చేశారు.ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆయన ముఖ్యమంత్రి కాగానే పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. పెంచిన నగదు సహా గత మూడు నెలలకు గాను రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు, పింఛను రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు లబ్ధిదారులకి అందజేశారు. ఉదయం నుంచే పంపిణీ జిల్లా వ్యాప్తంగా మొదలైంది. ఎలాంటి సాంకేతిక సమస్య లేకపోవడం, పంపిణీకి అవసరమైన నగదు ముందుగానే సిద్ధంగా ఉంచడంతో పంపిణీ సజావుగా సాగింది. నెలనెలా రూ.3 వేలు పింఛను తీసుకునే వారికి ఒక్కసారిగా రూ.7 వేలు ఇవ్వడంతో వారి అనందానికి అవధుల్లేవు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు పింఛనుదారులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు మొత్తం 2,71,696 పింఛన్లకు రూ.181 కోట్లు మంజూరు కాగా, సోమవారం సాయంత్రానికి 2,58,112 మందికి(95 శాతం) పంపిణీ చేశారు. మిగిలిన వారికి నేడూ ఇవ్వనున్నారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో ఉన్న వృద్ధులు పింఛను సొమ్ము తీసుకునేందుకు స్వగ్రామాలకు బయల్దేరారు. చిత్తూరు నుంచి యాదమరి వెళ్లే ఆర్టీసీ బస్సులో అంతా వారే కనిపించారు.

లబ్ధిదారులకు మెగా చెక్కు అందిస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌

పలమనేరు: వృద్ధురాలికి పింఛన్‌ ఇస్తున్న అమరనాథరెడ్డి

రొంపిచెర్ల: వృద్ధులకు పింఛను అందజేస్తున్న తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి తదితరులు

వడమాలపేట: పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌

శాంతిపురం: దివ్యాంగురాలికి నగదు అందజేస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నాయకులు

పెనుమూరు: ఎంపీడీవో కార్యాలయం వద్ద పింఛను అందిస్తున్న ఎమ్మెల్యే థామస్‌

పేటమిట్టలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌తో కలిసి పింఛను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మురళీమోహన్, పక్కనే గల్లా రామచంద్రనాయుడు

పింఛను తీసుకున్న ఆనందంలో మహబూబ్‌ బాషా

చిత్తూరులో మంచానికే పరిమితమైన దొరైరాజ్‌కు పింఛను అందజేస్తున్న సచివాలయ సిబ్బంది

ప్లకార్డులు చూపుతున్న తెలుగు మహిళలు

చిత్తూరు నుంచి యాదమరి బస్సులో వెళ్తున్న వృద్ధులు

బయోమెట్రిక్‌ తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది

పెంచిన సొమ్ము లెక్కించుకుంటున్న వృద్ధురాలు


చంద్రబాబు మా పాలిట దేవుడే...

వైకాపా అధికారంలోకి వచ్చినా రూ.3 వేలు పింఛను ఇవ్వడానికి ఐదేళ్లు పట్టింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పింఛను సాయాన్ని రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దనే ఇస్తున్నారు. మాలాంటి వృద్ధులపాలిట చంద్రబాబు దేవుడుగా నిలిచారు.

స్వామినాథన్, ఎన్‌.జి.చేన్లు గ్రామం, కుప్పం మండలం.


ఆరోగ్య సమస్యలు తీరుతున్నాయి

పెంచిన పింఛన్‌ మొత్తం రూ.7 వేలు అందుకున్నాను. దీంతో నాకు ఎంతో కాలంగా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడింది. మొదట పింఛన్‌ పెంచింది కూడా చంద్రబాబునాయుడే. పింఛన్‌ పెంపుతో సీఎం మా హృదయంలో నిలిచిపోయారు.

రంగప్పశెట్టి, బొమ్మదొడ్డి, పలమనేరు.


తెల్లవారుజామునే అందింది 

మాది పేటూరు పంచాయతీ ముచ్చకాలువ గ్రామం మండల కేంద్రానికి 40కిమీ దూరంలో ఉంది. సచివాలయ సిబ్బంది అడవిమార్గంలో వచ్చి తెల్లవారుజూమునే పెంచిన పింఛన్లు రూ.7వేలు అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రుణపడి ఉంటాం. గతంలో ఎప్పుడు ఇలా ఇవ్వలేదు. పెంచిన పింఛన్లతో బాబు రారాజులా నిలిచిపోతారు.

వాసుదేవనాయుడు, పెద్దబ్బ, ముచ్చుకాలువ గ్రామం


రుణపడి ఉంటా..

అంగ వైకల్యంతో పుట్టా. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నా. ఎక్కడికి వెళ్లాలన్నా చేతుల సహాయంతో నాలుగు కాళ్లపై నడిచినట్లు వెళాల్సిన పరిస్థితి. గతంలో ఇచ్చిన పింఛను అంతగా ఉపయోగపడేది కాదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే రెండింతలు పెంచి రూ.6 వేలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మొత్తం నా జీవనానికి సరిపోతుందని భావిస్తున్నా. ఇంత సహాయం చేసిన ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటా.

కాంతమ్మ, గొడుగుమానుపల్లె, పెనుమూరు మండలం


నా జీవనానికి భరోసా లభించింది..

ఒంటరి మహిళను. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు అండ. ఇదివరకు వచ్చే రూ.3 వేలు సరిపోయేది కాదు. ఇప్పుడు ఒకేసారి రూ.7 వేలు ఇవ్వడం, ఇకపై నెలకు రూ.4 వేలు రానుండటంతో హాయిగా జీవిస్తాననే భరోసా లభించింది.

గంగాభవాని, పుత్తూరు


ఇక సమస్యలు లేవు..

వృద్దురాలిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పింఛను మినహా ఏ ఆధారం లేదు. పింఛనుపై ఆధారపడి జీవిస్తున్నా. అనారోగ్యం చేసినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇకేసారి రూ.7 వేలు ఇచ్చారు. ఇకపై నెలనెలా రూ.4 వేలు వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు.

లక్ష్మమ్మ, జన్నావాళ్లమిట్ట, యాదమరి మండలం


చాలా సంతోషంగా ఉంది..

పింఛను పెరగడం చాలా సంతోషంగా ఉంది. ఖర్చులు పెరగడం, అనారోగ్య సమస్యలు రావడంతో ఇది వరకు వచ్చే పింఛను అంతంత మాత్రమే సరిపోయేది. ఇప్పుడు పెరగడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇవ్వడం చాలా గొప్ప విషయం.

విజయ్‌గోపాల్, పుత్తూరు


ఇంతకంటే ఇంకేం కావాలి..

ఒంటరి మహిళను. పింఛనే నాకు జీవనాధారం. రూ.3 వేలకే ఇది వరకు మురిసిపోయేదాన్ని. ఇప్పుడు రూ.7 వేలు చేతికందడంతో ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇకపై నెలకు రూ.4 వేలు వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛను పెంచి పేదలకు చాలా సాయం చేశారు. ఇంతకంటే మాలాంటి వాళ్లకు ఇంకేం కావాలి.

వసంతమ్మ, ఒంటరి మహిళ, బొమ్మదొడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని