logo

టాస్క్‌ఫోర్సా.. అదెక్కడ..?

గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది..

Published : 02 Jul 2024 03:06 IST

జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి
బానిసలవుతున్న యువత
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే

జిల్లాలో ఇటీవల పట్టుబడిన గంజాయి (పాత చిత్రం)

గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తోంది.. ఆకతాయి చేష్టలు, గొడవలు, దొమ్మీలు ఇతర నేరాలకు పురికొల్పుతోంది.. గంజాయి నిషేధమున్నా.. పోలీసులు, ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారుల వైఫల్యంతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతోంది.. గ్రాముల్లో సరఫరా అవుతున్న సరకు ప్రస్తుతం బస్తాల్లో రవాణా అవుతూ అందరినీ పరేషాన్‌ చేస్తోంది.. ఇటీవల వీటి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని స్వయంగా హోంమంత్రి అనిత ఆదేశించినా జిల్లాలో నేటికీ అమలు కాకపోవడం గమనార్హం.

జిల్లాలో గంజాయి సంస్కృతి చాపకింద నీరులా పారుతోంది. చిన్న పిల్లలు సైతం దానికి బానిసలుగా మారుతున్నారు. బస్తాల్లో వస్తున్న నిల్వలను స్థానిక అక్రమార్కులు వాటిని పొట్లాలుగా విభజించి అన్ని మండలాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడి వ్యక్తులు వాటిని చిన్నచిన్న పొట్లాల రూపంలో యువతకు విక్రయిస్తూ ఊబిలోకి నెట్టేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఈ మాయదారి మత్తు విచ్చలవిడిగా విస్తరిస్తున్నా ఏ ఒక్కరూ అడ్డుకట్ట వేయలేకపోయారు. అప్పట్లో వైకాపా నాయకుల అండదండలతో కొందరు బరితెగించి వ్యాపారం చేశారు. వాటికి పోలీసులు పూర్తి సహకారం అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే.. కొద్దికాలం కిందట చిత్తూరు నగరంలో మాదకద్రవ్యాలపై పోలీసులు దాడులు చేస్తే.. వైకాపా నేత ఒకరు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో పంచాయితీ చేసిన విషయం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ సమయంలో అక్కడి సీఐ, ఎస్సైలు చేతివాటం ప్రదర్శించారని తేలడంతో వారిపై వేటు పడింది. ఇలా పోలీసుల సహకారంతో గంజాయి రవాణా నేటికీ దర్జాగా సాగుతోంది.

ఉలుకూ పలుకు లేదు..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హోంమంత్రి అనిత గంజాయి అక్రమాలపై ఘాటుగా స్పందించారు. పోలీసులకు గంజాయి నిరోధానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రాత్రి 8 గంటలు దాటిన వెంటనే గుంపులు గుంపులుగా ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని, నేరాల నిరోధానికి కృషి చేయాలన్నారు. ఆమె ఆదేశాలతో అన్ని జిల్లాల్లో గంజాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటయ్యాయి. ఎక్కడికక్కడ దాడులు మొదలైనా చిత్తూరు జిల్లాలో గంజాయి నిరోధంపై ఉలుకూపలుకూ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తమై దృష్టిసారించాల్సిన అవసరం  ఉంది.

అక్రమ సంపాదన..

వైకాపా నాయకుల అండదండలు.. పోలీసుల సహకారంతో అక్రమ రవాణాతో సంపాదనకు అలవాటుపడిన కొందరు నేటికీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అప్పట్లో వైకాపా నేతలకు అంటకాగిన పోలీసులు, కానిస్టేబుళ్లు అదే స్టేషన్లలో ఉండటంతో  అక్రమార్కుల పంట పండింది.  ఎక్కడా దాడులు, చర్యలు లేకపోవడంతో కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నారు. నేటికీ అక్రమ రవాణా సాగుతుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం విడ్డూరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని