logo

ఆగిన ఆన్‌లైన్‌ సేవలు

ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్‌(టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) వెబ్‌సైట్‌ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 02 Jul 2024 03:03 IST

రాహు కాల సమయంలో ఇక్కట్లు

రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకునే భక్తులకు కౌంటర్‌ సిబ్బంది పంపిణీ చేసిన మాన్యువల్‌ టికెట్‌

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ఒక్కసారిగా సర్వర్లు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీఎంఎస్‌(టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) వెబ్‌సైట్‌ ద్వారా అన్ని ఆర్జిత సేవలు, అతిథి గృహాలు, ప్రసాద విక్రయాలకు సంబంధించి టికెట్లు పంపిణీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం రాహు కాల సమయంలో దోష నివారణ పూజలను చేయించేందుకు వచ్చిన భక్తులు కొంత మేర గందరగోళ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అక్రమాలకు అవకాశం

ఆన్‌లైన్‌ టికెట్‌ల ద్వారా కొంత అవినీతి, అక్రమాలు అరికట్టే అవకాశముంది. ముద్రిత టికెట్ల ద్వారా కట్టడి చేయడం కష్టమే. అయితే సోమవారం ఆన్‌లైన్‌ సేవలు ఆగిపోవడంతో నూతన ఈవో ఎస్‌వీఎస్‌ఎన్‌ మూర్తి సూచనల మేరకు డిప్యూటీ ఈవో ఏకాంబరం ముద్రిత టికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, అయితే ఎక్కడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా ముద్రిత టికెట్లు పంపిణీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కాలేదు.

ఆదుకున్న ముద్రిత టికెట్లు

ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాక ముద్రిత టికెట్లు పంపిణీ చేయకూడదని దేవాదాయ శాఖ స్పష్టమైన నిబంధనలు పెట్టింది. అయితే సోమవారం సర్వర్లు స్తంభించిపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి మేరకు ఇక్కడి అధికారులు ఇది వరకు నిల్వ ఉన్న ముద్రిత టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ సమయంలో భక్తులకు ఇబ్బందులు తప్పించేందుకు చర్యలు చేపట్టినా కొంత గందరగోళ పరిస్థితి తప్పలేదు.

పొరబాట్లకు అవకాశం లేకుండా

ముద్రిత టికెట్లు పంపిణీ కారణంగా ఎలాంటి పొరబాట్లు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఆయా కౌంటర్లకు పంపిణీ చేసిన ముద్రిత టికెట్లు నంబర్లను నమోదు చేయడంతో పాటు విక్రయించిన టికెట్లను పరిశీలించి పంపే విధంగా ఏర్పాట్లు చేపట్టాం. టికెట్‌ తీసుకువచ్చిన వాళ్ల ముందే వాటిని రెండుగా చించి పంపేలా చర్యలు తీసుకున్నాం. రొటేషన్‌ చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం.

ఏకాంబరం, డిప్యూటీ ఈవో, శ్రీకాళహస్తీశ్వరాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని