logo

వ్యవసాయ యంత్రాలతో దుండగుడి అరెస్ట్‌

రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద  ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Published : 02 Jul 2024 02:54 IST

లీజుకని తీసుకెళ్లి రూ.70 లక్షలకు అమ్మే యత్నం

గుడిబండ, న్యూస్‌టుడే: రైతు సంఘాలను, రైతులను మోసం చేసి వారివద్ద  ఉన్న వ్యవసాయ యంత్రాలను లీజుకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా అమ్ముకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ ఎస్‌కే బాజీ జాన్‌ సైదా సోమవారం గుడిబండ పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమవేశంలో వివరించారు. రొళ్ల మండలం ఉనసేకుంటకు చెందిన సి.తిమ్మరాజు రూ.70 లక్షలు విలువ చేసే 14 వేరుసెనగ, వరి నూర్పిడి యంత్రాలను లీజుకు తీసుకున్నాడు. ఆరు నెలల నుంచే పూర్వ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలులో ఉన్న రైతు ఉత్పాదక సంఘాలకు వెళ్లి మాయమాటలు చెప్పాడు. నకిలీ చిరునామాతో వారికి కొంత డబ్బు బయానాగా ఇచ్చి వేర్వేరుగా 14 యంత్రాలను లీజుకు తీసుకున్నాడు. అప్పటి నుంచి బాడుగ చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా మోసం చేసి సదరు యంత్రాలను అమ్మకాలకు బేరం మాట్లాడుకొన్నాడు. గుడిబండ మండలం మందలపల్లి శ్రీసిద్ధేశ్వర రైతు ఉత్పాదక సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపి లాగడంతో ఈ మోసం బయటపడిందని డీఎస్పీ తెలిపారు. గుడిబండ మండలం హిరేతుర్పి ఎస్సీ కాలనీ బస్‌ స్టాప్‌ వద్ద అరెస్టు చేసి అతను దాచి ఉంచిన యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ జిల్లాల రైతు సంఘాల సభ్యులు తమ యంత్రాలకు సంబంధించిన దస్త్రాలను తీసుకొచ్చి పరిశీలించుకోవాని కోరారు. సీఐ రాజ్‌కుమార్, ఎస్సై మునిప్రతాప్‌ పాల్గొన్నారు. దర్యాప్తులో సాయ పడిన ఏఎస్సై చంద్రశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్, కానిస్టేబుళ్లు వెంకటేష్, హరినాథ్, బాస్కర్, శివానంద, నరేష్, పాతన్న, మహ్మద్‌రఫి, హోమ్‌గాడ్‌లు జగన్నాథ్‌నాయక్, చంద్ర, రమేష్, ఉమేష్‌లకు రివార్డులు ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని