logo

పండగ చేద్దాం రండి

జిల్లాలో 2,69,162 మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్‌ మొత్తం అందుకోనున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్‌ మొత్తం పెంచడంతోపాటు మూడు నెలల బకాయి కలిపి అందించనున్నారు.

Updated : 01 Jul 2024 05:20 IST

2.69 లక్షల మందికి రూ.182.33 కోట్ల పంపిణీ
ఎన్నికల హామీ అమలుపై హర్షాతిరేకాలు

కూటమి ప్రభుత్వం తొలి సంక్షేమ పండగకు సిద్ధమైంది. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయగా పెంచిన పింఛను మొత్తాన్ని సోమవారం నుంచి అందించనున్నారు. దీంతో పింఛనర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. క్లస్టర్ల వారీగా సచివాలయ సిబ్బంది, లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బట్వాడా చేయనున్నారు. మొదటిరోజే 90% పైగా పంపిణీ పూర్తిచేసే లక్ష్యంతో ఉదయం ఆరుగంటల నుంచే వారు ఇంటింటికీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు పంపిణీ కార్యక్రమం జరగనుంది. 

న్యూస్‌టుడే, తిరుపతి (భవానీనగర్‌): జిల్లాలో 2,69,162 మంది లబ్ధిదారులు పెంచిన పింఛన్‌ మొత్తం అందుకోనున్నారు. ఎన్నికల హామీ మేరకు పింఛన్‌ మొత్తం పెంచడంతోపాటు మూడు నెలల బకాయి కలిపి అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత, చర్మకారులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్‌ఐవీ బాధితులు, హిజ్రాలు, కళాకారులు రూ.4000లతోపాటు రూ.3000 చొప్పున మొత్తం రూ.7000 అందుకోనున్నారు. దివ్యాంగులు, కుష్ఠు, వైకల్యం ఉన్నవారికి రూ.6000.. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి, డయాలసిస్‌ ఇతరత్రా బాధితులకు రూ.10,000 చొప్పున అందజేస్తారు. పక్షపాతంతో మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.15,000 పింఛను మొత్తం ఇవ్వనున్నారు.

50 మంది మించకుండా కేటాయింపు 

అర్హుల జాబితా మేరకు సోమవారం ఉదయం నుంచే పంపిణీకి ఏర్పాట్లు సిద్ధంగా చేశాం. మొదటిరోజు సాయంత్రంలోపు అందరికీ ఇంటి వద్దనే అందించే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాం. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులు మించకుండా కేటాయించాం. లబ్ధిదారులు ఇళ్లవద్దే ఉండి సహకరించాలి.

ప్రభావతి, డీఆర్‌డీఏ పీడీ రెండు కాళ్లు విరిగాయి 

ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సిద్ధం కావడం హర్షణీయం. ప్రమాదవశాత్తూ మెట్ల మీద నుంచి కింద పండటంతో రెండు కాళ్లు విరిగాయి. బతుకు పోరాటంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నా. ఈ సమయంలో పెంచిన పింఛన్‌ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది.

పెంచెల లక్ష్మి, శివజ్యోతినగర్, తిరుపతి

వెన్నుపూస దెబ్బతిని 

సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ చంద్రబాబు చేసి చూపుతున్నారు. వృద్ధుల పాలిట వరం. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల నేతృత్వంలో రాష్ట్ర ప్రగతిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నా. ప్రమాదవశాత్తు ఎడ్లబండి నుంచి కింద పడటంతో వెన్నుపూస దెబ్బతింది. 32 ఏళ్లుగా బాధపడుతున్నా. పెంచిన పింఛన్‌ మొత్తం చేదోడుగా ఉండనుంది.

రాధాకృష్ణరెడ్డి, అక్కారంపల్లి, తిరుపతి

పోలియోతో  బాధపడుతున్నా 

చిన్ననాటి నుంచే పోలియో వ్యాధితో బాధపడుతున్నా. కుటుంబ పోషణకోసం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆటో నడుపుతూ కుటుంబ అవసరాలు తీర్చగలుగుతున్నాు. ఈ సమయంలో ప్రభుత్వం పెంచిన పింఛను నా కుటుంబానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

వెంకటేష్, తిరుపతి

కిడ్నీ సమస్యతో.. 

నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో రెండు పర్యాయాలు డయాలసిస్‌ చేయించుకుంటున్నా. కూటమి ప్రభుత్వంలో నాలాంటివారి వైద్యఖర్చుల కోసం రూ.10వేలు ఇవ్వడం మరింత మనోధైర్యాన్ని నింపినట్లయింది. ఇంటి వద్దకే వచ్చి అందించడం ఆనందదాయకం. 

లోకేష్, సుబ్బారెడ్డినగర్, తిరుపతి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు