logo

ఒక్కసారిగా.. ముంచేశారు

తోతాపురి మామిడి కాయల ధర పతనం కొనసాగుతోంది. మామిడి రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. జాక్‌పాట్‌ ధర వస్తుందని ఆశించిన రైతులు చివరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Jul 2024 03:05 IST

టన్ను రూ.19 వేలకు తగ్గింపు  
కుదేలైన మామిడి రైతు

బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో అమ్మకానికి వచ్చిన తోతాపురి కాయలు  

చిత్తూరు కలెక్టరేట్, బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: తోతాపురి మామిడి కాయల ధర పతనం కొనసాగుతోంది. మామిడి రైతుల పరిస్థితి జూదాన్ని తలపిస్తోంది. జాక్‌పాట్‌ ధర వస్తుందని ఆశించిన రైతులు చివరకు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. శనివారం టన్ను రూ.21 వేలు పలకగా ఆదివారానికి రూ.19 వేలకు తగ్గింది. రెండ్రోజుల్లో టన్నుకు రూ.5వేల మేర ధర పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పలమనేరు, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గ మండలాలోని పలుప్రాంతాల నుంచి రైతులు మామిడికాయలు పలు వాహనాల్లో బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు తెస్తున్నారు. ఈక్రమంలో ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు నిర్వాహకులు వ్యూహాత్మకంగా రాత్రి ఏడు గంటలకు ధర ప్రకటించకుండా ఆపై నిర్ణయిస్తూ రైతులతో దోబూచులాడుతున్నారు. పంట ముంగిపు ద]శలో ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలుతోంది. ర్యాంపు వ్యాపారులు, పండ్లగుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సిండికేట్‌ అయి ధరలు ఇష్టానుసారంగా తగ్గిస్తున్నా పట్టించుకేనే వారు లేరని రైతులు వాపోతున్నారు. పంట పక్వానికి వచ్చి తోటలో మాగిపోతుండటంతో నిల్వ ఉంచలేని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో గిట్టుబాటు కాని ధరలకు విక్రయించేసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసున్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టరు చర్యలు తీసుకుని గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

కిలో రూ.24 : కలెక్టర్‌

జులై ఒకటి నుంచి మూడో తేదీ వరకూ జిల్లాలో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కిలోకి రూ.24కు తగ్గకుండా ఉంటుందని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆదివారం పండ్ల గుజ్జు పరిశ్రమల యాజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తోతాపురి మామిడికి గతంలో కిలో రూ.30 గిట్టుబాటు ధర నిర్ణయించారన్నారు. ఈ విషయంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించేందుకు రైతులు, పరిశ్రమల యాజమానులతో చర్చించి ధర నిర్ణయించామన్నారు. మూడురోజుల తర్వాత మళ్లీ చర్చించి.. కొత్త ధర ప్రకటిస్తామన్నారు. రైతులు మామిడి పంట నేరుగా గుజ్జు పరిశ్రమల వద్దకు తీసుకెళ్లాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి, గుజ్జు పరిశ్రమల యజమానులు రాఘవా చాట్లీ, మంజునాథ్, గోవర్ధన్‌ బాబి, సమీర్, సోము, రైతు నాయకులు నాగేశ్వరరావు, వేణు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు