logo

82,684 భూహక్కు పత్రాలకు చెల్లు

గత వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా అమలు చేసిన శాశ్వత భూహక్కు భూరక్షణ పథక రీసర్వే అభాసుపాలైంది.

Updated : 01 Jul 2024 05:22 IST

రాజముద్రతో పంపిణీకి ప్రభుత్వ చర్యలు

భూహక్కు పత్రంపై జగన్‌ ఫొటో 

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా అమలు చేసిన శాశ్వత భూహక్కు భూరక్షణ పథక రీసర్వే అభాసుపాలైంది. వందేళ్ల తర్వాత భూ సరిహద్దులను పక్కాగా నిర్ణయిస్తామంటూ ఉపన్యాసాలతో ఊదరగొట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను జగన్‌ మూటగట్టుకున్నారు. పథకం నిర్వహణ, రీసర్వే తీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రజల భూ స్థిరాస్తులపై సైతం సొంత డబ్బా కొట్టుకునేలా జగన్‌ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. గతంలో పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండేది. అయితే రీసర్వే తర్వాత రైతులకిచ్చిన భూహక్కు పత్రాల్లో జగన్, నవరత్నాల బొమ్మలు వేయడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. తొలి, ఆఖరు పేజీల్లోనే కాదు. ప్రతి పేజీలోనూ సదరు బొమ్మలు దర్శనం ఇవ్వడంపై ప్రజాగ్రహం వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజల విన్నపం మేరకు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం భూహక్కు పత్రాలను పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకొంది. గతంలో మాదిరే పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్రను మాత్రమే ముద్రించి ఇవ్వాలని సంకల్పించింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రకటించడం విశేషం.

జిల్లాలో రీసర్వే ఇలా.. 

జిల్లాలో మొదటిదశలో 132, రెండోదశలో 91, మూడోదశలో 106 గ్రామాల్లో రీసర్వే చేశారు. సర్వే పూర్తయిన చోట్ల 3.09 లక్షల సరిహద్దు రాళ్లు నాటినట్లు చెబుతుండగా చాలా గ్రామాల్లో వాటిని రైతులు పీకి పారేశారు. కొన్నిచోట్ల అలానే వదిలేశారు. సర్వే పూర్తయిన చోట్ల భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 82,684 పత్రాలు పంపిణీ చేశారు. ఈ పత్రాల్లో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సవరించలేదు. సవరణల కోసం కార్యాలయాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరిగినా ఎటువంటి పరిష్కారం జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు