logo

ఐదేళ్లూ.. ఇలా వదిలేశారు..!

కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లయిపోయిందని తేలిగ్గా చెప్పేశారు మాజీ సీఎం జగన్‌. ఈ ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఓ నిదర్శనం జిల్లా పరిశ్రమల కేంద్ర భవనం.

Updated : 01 Jul 2024 05:26 IST

నిలిచిన పరిశ్రమల కేంద్ర భవన నిర్మాణ పనులు 

ప్రాంగణంలో పెరిగిన పిచ్చిమొక్కలతో కనిపించని భవనం 

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: కళ్లు మూసి తెరిచేలోగా ఐదేళ్లయిపోయిందని తేలిగ్గా చెప్పేశారు మాజీ సీఎం జగన్‌. ఈ ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఓ నిదర్శనం జిల్లా పరిశ్రమల కేంద్ర భవనం. పరిశ్రమల వ్యవహారాల్ని నడిపించే జిల్లా పరిశ్రమల కేంద్రం నూతన కార్యాలయ నిర్మాణ పనులు నిలిచి ఐదేళ్లవుతోంది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ఐదేళ్లలో పనులు ఎక్కడ వేసిన గొంగళి చందాన మారాయి. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ముందస్తు అనుమతులు, స్థాపన తర్వాత పారిశ్రామివేత్తలకు రాయితీలు అందించడంలో జిల్లా పరిశ్రమల కేంద్రం పాత్ర అత్యంత కీలకం. ఇంత కీలకమైన ఈ శాఖ పరిస్థితే ఇలా ఉంటే.. పరిశ్రమల ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా పరిశ్రమల కేంద్ర భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

ప్రగతికి కీలకం.. 

జిల్లా ప్రగతిలో కీలకం పరిశ్రమల శాఖ. అయితే సొంత భవన నిర్మాణం సాకారం కాకపోవడంతో ఇంకా అద్దె భవనంలోనే పాలన సాగిస్తున్నారు. కొత్త భవన నిర్మాణ సమయంలో చిత్తూరులోని సహకార బ్యాంకు పాత కార్యాలయ భవనం నుంచి పాలన సాగించారు. ఆ తర్వాత అక్కడినుంచి మరోచోటకు కార్యాలయాన్ని తరలించారు. కొత్త ప్రభుత్వమైనా శ్రద్ధ తీసుకుని పనుల్ని పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది.

వైకాపా ప్రభుత్వంలో..

జిల్లా పరిశ్రమల కేంద్రం సొంత భవనం చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌లో ఉంది. పాత భవనాన్ని 80వ దశకంలో నిర్మించారు. భవనం గోడలు నెర్రులు చీలడం, పైకప్పు ఉరుస్తుండటం, వర్షపు నీటితో రికార్డు గది తడసిపోతున్న కారణంగా నూతన భవన నిర్మాణం కోసం పనులు చేపట్టారు. రూ.3 కోట్ల అంచనాతో 2018 మార్చి 3న శంకుస్థాపన చేశారు. వేగంగా సాగిన నిర్మాణ పనులు వైకాపా ప్రభుత్వం కొలువుదీరగానే నెమ్మదించాయి. దీంతో మొదటి అంతస్తు వరకు పిల్లర్ల నిర్మాణాలతో పనులు నిలిచి పోయాయి. గోడ ఏర్పాటు ఇప్పటివరకు జరగనేలేదు. ఫలితంగా ఈ భవనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం కారడివిని తలపిస్తోంది. ఇక్కడ పెద్దఎత్తున గుబురుగా వృక్షాలు పెరిగాయి. పాములు తిరుగుతున్నాయి. లోనికి వెళ్లేందుకు జంకుతున్నారు. మొత్తంమీద అక్కడి పరిస్థితి గగుర్పాటు గొలిపేలా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని