logo

విద్యుత్తు సమస్యలపై.. ప్రతి బుధవారం వినతుల స్వీకరణ

అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం.. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని విద్యుత్తుశాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ సురేంద్ర నాయుడు

Published : 01 Jul 2024 02:46 IST

నాణ్యమైన సరఫరా లక్ష్యంగా ప్రణాళిక

సురేంద్ర నాయుడు 

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం.. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని విద్యుత్తుశాఖ తిరుపతి సర్కిల్‌ ఎస్‌ఈ సురేంద్ర నాయుడు పేర్కొన్నారు. స్థానిక విద్యుత్తుశాఖ అతిథి గృహంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి బుధవారం డివిజన్‌ కార్యాలయాల్లో వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టాం. సర్కిల్‌ పరిధిలోని ఎనిమిది డివిజన్‌ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఈ నెల 3న బుధవారం నుంచి ప్రారంభించనున్నాం. ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తాం. ప్రతి ఫిర్యాదు అంతర్జాలంలో నమోదు చేసి సమస్య పరిష్కారం కాగానే సంబంధిత సంక్షిప్త సమాచారం ఫిర్యాదుదారుడి చరవాణికి వస్తుంది.వినియోగదారుల సేవే లక్ష్యంగా వినతుల స్వీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నాం.

ప్రతి లైన్‌ తనిఖీకి చర్యలు..

విద్యుత్తు సరఫరాలో ఎదురయ్యే సమస్యలు అధిగమించేందుకు ప్రతి లైన్‌ క్షుణ్ణంగా తనిఖీకి మూడు నెలల ప్రణాళిక రూపొందించాం. సర్కిల్‌లో 430 విద్యుత్తు ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,650 ఫీడర్ల కింద ఉన్న విద్యుత్తు లైన్లు తనిఖీ చేసి పునరుద్ధరించనున్నాం. లైన్లకు అడ్డంగా ఉన్న చెట్ల తొలగింపు, స్తంభాలు, ప్రమాదకరంగా ఉన్న లైన్లు మార్పు చేయనున్నాం. విద్యుత్తు సమస్యతో ఎక్కడా పంటలు ఎండకూడదు. సాగుకు నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరాకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. లోవోల్టేజీ ప్రాంతాల్లో నూతనంగా విద్యుత్తు ఉప కేంద్రాల ఏర్పాటు చేస్తాం. త్వరలో కుప్పం నియోజకవర్గంలో 12 నూతన ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. 

తప్పిదాలకు పాల్పడితే విజిలెన్స్‌ విచారణ..

అక్రమాలు, తప్పిదాలకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై విజిలెన్స్‌ విచారణ తప్పదు. సర్వీసుల జారీలో జాప్యం, సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి తెస్తే తక్షణమే సంబంధిత అధికారి, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలుంటాయ’ని ఎస్‌ఈ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని