logo

అక్రమ క్వారీయింగ్‌పై చర్యలు తీసుకోవాలి

మండలంలో గత ప్రభుత్వంలో అక్రమంగా కొండల నుంచి తోడేసిన గ్రావెల్‌ క్వారీపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ అధికారులను ఆదేశించారు.

Published : 01 Jul 2024 02:43 IST

అధికారులకు ఎమ్మెల్యే భానుప్రకాష్‌ ఆదేశం

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్‌ 

విజయపురం, న్యూస్‌టుడే: మండలంలో గత ప్రభుత్వంలో అక్రమంగా కొండల నుంచి తోడేసిన గ్రావెల్‌ క్వారీపై సమగ్ర విచారణ నిర్వహించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జమున అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొండల నుంచి గ్రావెల్‌ మట్టిని అక్రమంగా ఒక సర్వే నంబరులో అనుమతి తీసుకుని మరోచోట మట్టి తవ్వి అక్రమంగా సరిహద్దున ఉన్న తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారన్నారు. ఇందుకు అధికారులు వత్తాసు పలికారని, ఇకపై అలాంటి ఆటలు సాగవన్నారు. అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకుంటే వారిపై చర్యలు తప్పవని, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడ క్వారీ మైనింగ్‌ సంబంధించిన లారీలు అక్రమంగా తిరిగితే సీజ్‌ చేయాలన్నారు. మండల పరిషత్‌ నిధుల దుర్వినియోగంపై ఉన్న ఫిర్యాదులు విచారించి చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య పరిష్కరించాల న్నారు. డీఎస్పీ నరసింహమూర్తి, ఎంపీడీవో బ్రహ్మయ్య, తహసీల్దారు మల్లికార్జునరావు, జడ్పీటీసీ సభ్యురాలు రేవతి, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను తెదేపా శ్రేణులు ఈ సందర్భంగా సత్కరించాయి.

గ్రామస్థుల నిరసన

పాలసముద్రం, న్యూస్‌టుడే: నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ క్వారీ, గ్రావెల్‌ తరలింపును నిలిపి వేయాలంటూ గ్రామస్థులు, యువత నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ పరిధి సరిహద్దులో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చేపడుతున్న క్వారీని వెంటనే నిలిపివేయాలని నినదించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం నుంచి తమిళనాడుకు చెందిన వ్యక్తి క్వారీ నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి కొంతమేరకు అనుమతి తీసుకొని కొండలు కూడా కొట్టేశాడని వాపోయారు. రాత్రికిరాత్రి బిల్లులు లేకుండా గ్రావెల్‌ను తమిళనాడుకు తరలించి లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అనుమతి పత్రాలు చూపాలని అడిగితే బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేలా చూడాలని గ్రామస్థులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని