logo

స్థిరాస్థి క్షేత్రాల్లో వాటాలుగా దోపిడీ

వైకాపా జమానాలో స్థిరాస్థి రంగం కుదేలైంది.. అడపాదడపా వెలిసినా వాటి పేరుతో వసూళ్లపర్వం కొనసాగింది. అటు ప్రజాప్రతినిధులు..

Updated : 01 Jul 2024 05:21 IST

ఐదేళ్లలో పెద్దఎత్తున అనధికార లౌఅవుట్ల ఏర్పాటు
లెక్కలు తేల్చడంలో అధికారులు నిమగ్నం

నాయుడుపేట మండలం విన్నమాల వద్ద.. 

గూడూరు, న్యూస్‌టుడే: వైకాపా జమానాలో స్థిరాస్థి రంగం కుదేలైంది.. అడపాదడపా వెలిసినా వాటి పేరుతో వసూళ్లపర్వం కొనసాగింది. అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికారులు అందినకాడికి దోచేశారు. ఇదే అదనుగా ఐదేళ్లలో అధికార పార్టీ అండతో వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు మాయం చేశారు. మామూళ్లు దండుకున్న ప్రజాప్రతినిధులు.. ఇక్కడ మట్టి, గ్రావెల్‌ తరలింపునకు సహకరించడం గమనార్హం.. అనధికార లేఅవుట్లపై తెదేపా ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తుండటంతో వాటాల లెక్కలు బయట పడుతున్నాయి. 
జిల్లాలోని పురపాలికల్లో 277 వెంచర్లను 1,215.15 ఎకరాల్లో విస్తరించారు.  ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసే పరిస్థితి లేకపోవడంతో వాటికి నోటీసులు ఇస్తున్నారు. ఈక్రమంలో వెంచర్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అనధికారికంగా అమ్మకాలు చేపట్టగా మిగిలి వాటిని ప్రభుత్వ నిబంధనల మేరకు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
నేతల జేబుల్లోకి.. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వెలిసిన ప్రతి క్షేత్రం ఇక్కడి ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఏర్పాటైంది.వెంచర్లలో వాటాలు లేదా.. మామూళ్లు ఇవ్వందే దస్త్రం కదిలేది కాదని ఆ పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. అధికారిక వెంచర్ల మాటున రూ.కోట్లు చేతులు మారినట్లు.. పెద్దఎత్తున స్థలాలు పోగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఎన్నికల సమయంలో బెదిరింపులు..  శ్రీకాళహస్తి ప్రతినిధి స్థిరాస్తి వ్యాపారంలో రాటుదేలిన వ్యక్తి కాగా అంతా ఆయన గుప్పెట్లోనే ఇక్కడ వెంచర్లు వెలిశాయి. ఐదేళ్లలో రూ.కోట్లలో కూడబెట్టి ఎన్నికల్లో వ్యయం చేశారు. ఎన్నికల్లో స్థిరాస్తి వ్యాపారులను బెదిరించిన నేతలు వారితో రూ.కోట్లు ఖర్చు చేయించారు.  

ముందే మాట్లాడుకుని.. : సూళ్లూరుపేట పురపాలక సంఘంలో మూడో వార్డులో విచ్చలవిడిగా వెంచర్లు ఉన్నాయి. ఇందులో 291 ప్లాట్లతో వెలసిన 17 ఎకరాల వెంచర్‌ ఉండటం గమనార్హం. ఓ స్థిరాస్తి క్షేత్రం వైకాపా నేతది కాగా సదరు నేతకు నోటీసు వెళ్లడంతో అంతా ముందే మాట్లాడుకున్నాం.. మళ్లీ ఇదేమిటి.. అంటూ అధికారులపై ఆగ్రహించడం వంతైంది. గూడూరు పోటుపాళెం పంచాయతీలో 26 అనధికార స్థిరాస్తి క్షేత్రాలు వెలిశాయి. ఇందులో 227 ప్లాట్లలో 15.91 ఎకరాలు, 88 ప్లాట్లు వేసిన మరో వెంచర్‌ ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని