logo

చెప్పేది శ్రీసిటీ.. చేసేది లూటీ

తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులోని పారిశ్రామిక నగరం శ్రీసిటీ పేరుతో మట్టి దోపిడీ అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం మారినా.. మట్టి అక్రమరవాణా మాత్రం ఆగలేదు.

Updated : 30 Jun 2024 05:36 IST

అధికారం మారినా ఆగని మట్టి అక్రమ రవాణా
తెర వెనుక కడప మార్క్‌

శ్రీసిటీ పరిధిలో చెరువులో చేపడుతున్న మట్టితవ్వకాలు

సత్యవేడు, వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: తమిళనాడు-ఆంధ్ర సరిహద్దులోని పారిశ్రామిక నగరం శ్రీసిటీ పేరుతో మట్టి దోపిడీ అక్రమార్కులకు వరంగా మారింది. అధికారం మారినా.. మట్టి అక్రమ
రవాణా మాత్రం ఆగలేదు. సత్యవేడు, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో శ్రీసిటీ పేరుతో మట్టిరవాణాకు తెరదీశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కడపకు చెందిన సీఎం బంధువు పేరుతో మూడేళ్లుగా యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణాను సాగించిన ఆ విక్రమార్కుడు, ప్రస్తుతం అధికారం మారడంతో తాను తెర వెనుక ఉంటూ తెరముందు శ్రీసిటీ పెద్దల సాయంతో మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైనం ఇటీవల మల్లావారిపాళెం(వెస్ట్‌)లో వెలుగు చూసింది.

పరిశ్రమల పేరుతో ప్రైవేటు వ్యాపారులకు

నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినా శ్రీసిటీలోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతోంది. శ్రీసిటీ పరిశ్రమలతోపాటు, శ్రీసిటీ పరిసరాల్లో భూములకు గిరాకీ దృష్ట్యా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, విలాస హోటళ్లు వంటి వ్యాపార భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే అదునుగా వాటి భూ అభివృద్ధిపనులకు మట్టి అవసరం కావడంతో అనుమతుల్లేకుండా చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని కొల్లగొట్టి అక్రమరవాణా చేస్తూ, ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. శ్రీసిటీ కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తడ, తమిళనాడు పరిధిలో సరిహద్దు ప్రాంతాలైన ఆరంబాకం, మాదరపాకం ప్రాంతాలలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలకు, బహుళ అంతస్తుల భవనాలు, ఇతర వ్యాపార భవనాలకు మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మట్టి అక్రమ రవాణాను, తవ్వకాలను నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

రక్తం మరిగిన పులిలా.. మట్టిని వదలని విక్రమార్కుడు

వైకాపా హయాంలో సీఎం బంధువు తాలూకా వ్యక్తి సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లోని ప్రభుత్వ భూములు, చెరువులను ఇష్టానుసారంగా కొల్లగొట్టి తమిళనాడుకు తరలించారు.  అప్పట్లో సీఎం సోదరుడు అవినాష్‌రెడ్డి బంధువనే కారణంతో అధికారులు అక్రమరవాణా వైపు కన్నెత్తి చూడటానికి భయపడేవారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో తన వ్యాపారాన్ని కొనసాగించడానికి కొత్త వ్యూహానికి తెరదీశారు. నాడు సీఎం బంధువుగా ఇక్కడ అందరికీ సుపరిచితుడైన విక్రమార్కుడు శ్రీసిటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కీలక పదవిలో ఉన్న ప్రముఖవ్యక్తితో ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని, ఇరువురూ ఉమ్మడిగా ఇక్కడ మట్టి వ్యాపారాన్ని కొనసాగించారు. సత్యవేడు మండలం మల్లావారిపాళెం(వెస్ట్‌)లో ఇటీవల చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

అనుమతులు లేకుండా మట్టితవ్వితే చర్యలు

శ్రీసిటీలోగాని మరెక్కడా చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. శ్రీసిటీ పధిలోని చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు భూగర్భ గనులశాఖ అధికారులతో కలిసి తవ్వకాలను అడ్డుకున్నాం.ఎక్కడైనా అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

 రామాంజనేయులు, తహసీల్దార్, సత్యవేడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని