logo

నాడు రావని.. నేడు వచ్చేస్తాయని

గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని పనులు చేసినా బిల్లులు తీసుకోవడం కష్టమని భావించారు వైకాపా నేతలు. దీంతో 2018లో టెండరు దక్కించుకున్న నేతలు 2019లో అగ్రిమెంటు చేసుకున్నా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని కొనసాగించారు.

Updated : 30 Jun 2024 05:24 IST

సద్దికూడుమడుగులో వైకాపా గుత్తేదారుల దోపిడీ
దువ్వ ఇసుకతో పనులు
నాగలాపురం, న్యూస్‌టుడే

వంతెన వద్ద సిమెంటు పూత దెబ్బతినడంతో కనిపిస్తున్న వాగులోని ఎర్ర ఇసుక

గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని పనులు చేసినా బిల్లులు తీసుకోవడం కష్టమని భావించారు వైకాపా నేతలు. దీంతో 2018లో టెండరు దక్కించుకున్న నేతలు 2019లో అగ్రిమెంటు చేసుకున్నా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యాన్ని కొనసాగించారు. తెదేపా పాలనలో రైతాంగం పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారని గుర్తెరిగిన వైకాపా నేతలు తాము గతంలో పొందిన పనుల్లో ప్రస్తుతం వేగాన్ని పెంచారు. చెరువుల ఆధునికీకరణ, కట్ట పటిష్టీకరణ వంటి పనులు త్వరితగతిన చేస్తున్నారు. 60 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యంతో అధికారికంగా 900 ఎకరాల ఆయకట్టు, అనధికారికంగా మరో 300 ఎకరాల ఆయకట్టుకు ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న ఈ చెరువు ఆధునికీకరణలో జరుగుతున్న గుత్తేదారు తీరుతో విలువైన జైకా నిధులు పక్కదారిపడుతున్నాయి.

రైతులకు ఉపయుక్తమైన పనులను త్వరగా చేయడం ఆశాజనకమే అయితే పనుల్లో నాణ్యతను వైకాపా నేతలు పూర్తిగా విస్మరిస్తున్నారు. నాగలాపురం మండలంలోని సద్దికూడుమడుగుకు రూ.2.25 కోట్ల అంచనాతో పనులను కేటాయించారు. చెరువు కట్ట పటిష్ఠం, కలుజు నిర్మాణం, వంతెన, సిమెంటు కాలువల నిర్మాణం చేయాల్సి ఉంది. చెరువు కట్ట ఎత్తును పెంచడానికి గ్రావెల్‌ కట్టపై వేసి క్యూరింగ్, రోలింగ్‌ చేయాల్సి ఉంది. ఈ పనులకు నాణ్యమైన గ్రావెల్‌ను తీసుకురావాల్సి ఉండగా.. గుత్తేదారు కట్ట పక్కనే ఉన్న చెరువు కాలువలోని పెద్ద రాళ్లతో ఉన్న మట్టిని తరలిస్తున్నారు. రాళ్లు కనబడకుండా ప్రస్తుతం చెరువులోని మట్టితో కప్పేస్తున్నారు. నూతన కలుజు నిర్మాణం పక్కనబెట్టి పాత కలుజుపైనే సిమెంటు తాపడం చేస్తున్నారు. వంతెన నిర్మాణంలో ఇసుక స్థానంలో దువ్వఇసుక, ఎర్ర ఇసుకతోనే పనులు చేస్తున్నారు. ఇప్పటికే కొంత దెబ్బతింది. సిమెంటు కాలువల వద్ద పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కప్పిపుచ్చుకునేలా సిమెంటు కాలువల అంచుల వెంబడి మట్టేసి కనబడకుండా చేయిస్తున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ ఏఈ మురళీ మోహన్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదులు పరిశీలిస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో పరీక్షలు చేశాకే బిల్లులు చెల్లిస్తామన్నారు.

 కట్టపై బండరాళ్లు కనబడకుండా  పోసిన చెరువు మట్టి

ఎందరికి చెప్పినా ఫలితం లేకపోయింది..

సద్దికూడుమడుగు వద్ద కట్ట పనులకు బండరాళ్లను వినియోగించారు. ఈ రాళ్లు కనబడకుండా మట్టిని పోస్తున్నారు. గుత్తేదారును నిలదీసినా, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోయింది. వైకాపా నేతల వత్తిళ్లు, ప్రలోభాలకు లోబడి అధికారులు పట్టించుకోవడం లేదు.

 గోతాం బలరామయ్య యాదవ్, రైతు, జంబుకేశవపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని