logo

మైనింగ్‌ అక్రమాలపై ఉక్కుపాదం!

గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేసి కోట్ల రూపాయలు ఆర్జించారు.

Published : 30 Jun 2024 02:21 IST

 ప్రతి మండలంలోనూ అధికారుల బృందం సంయుక్త తనిఖీలు  
అవకతవకలకు పాల్పడ్డ వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు 

పూతలపట్టు మండలం తేనెపల్లి క్వారీలో తనిఖీ చేస్తున్న అధికారుల బృందం  

ఈనాడు, చిత్తూరు: గత ఐదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేసి కోట్ల రూపాయలు ఆర్జించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలే ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు పాల్పడటంతో జిల్లా యంత్రాంగం సైతం స్థానిక నేతల అక్రమాలను చూసీచూడనట్లుగా వదిలేసింది. ఇలా వైకాపా పాలనలో వందల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. తెదేపా నాయకులు అప్పట్లో ఈ అంశంపై ప్రశ్నించినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారం చేతులు మారడంతో మైనింగ్‌ అక్రమాలను నిగ్గు తేల్చాలనే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే గనులు, ఎస్‌ఈబీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ప్రతి మండలంలోనూ ఓ కమిటీని నియమించారు. అక్రమాలకు పాల్పడ్డ వైకాపా నేతలకు ఇది శరాఘాతంలా మారింది. గ్రానైట్, గ్రావెల్, రోడ్డు మెటల్‌ తదితర ఖనిజాలకు సంబంధించి 625 లీజులున్నాయి. ఇందులో 520 వరకు గ్రానైట్‌ క్వారీలే ఉన్నాయి. ప్రధానంగా కుప్పం, శాంతిపురం, గుడిపాల మండలాల్లో ఎక్కువగా లీజులు పొందారు. నలుగురు అధికారుల బృందం ఆయా ప్రాంతాలకు సంయుక్తంగా వెళ్లి ఎంత విస్తీర్ణానికి అనుమతులు పొందారు? ఎంత తవ్వారు? అనే వివరాలు సేకరించనున్నారు. శుక్రవారమే అధికారుల బృందం రంగంలోకి దిగింది. పరిమితికి మించి జరిగి ఉంటే ఎంత విలువైన ఖనిజం తరలించారనేది కూడా నిర్ధారించి జులై 7వ తేదీ నాటికి జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇవ్వనున్నారు. 

అనధికారిక తవ్వకాలు తనిఖీ చేస్తేనే! 

ప్రభుత్వం తమదే కాబట్టి ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో కుప్పం, పూతలపట్టు, నగరి, చిత్తూరు నియోజకవర్గాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే కొందరు వైకాపా నాయకులు గ్రానైట్, గ్రావెల్‌ కొల్లగొట్టారు. వీటిని గుర్తించి ఇక్కడ కూడా తనిఖీలు చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎంత సంపదను మాయం చేశారో అర్థమవుతుంది. ఇదే క్రమంలో బాధ్యులనూ గుర్తించి జరిమానా విధించేందుకు సిఫార్సు చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇటువైపు తొంగి చూసేందుకు అవకాశం ఉండదు. విజయపురం మండలంలో రోజుకు వందలాది టిప్పర్లలో గ్రావెల్‌ను పొరుగునే ఉన్న తమిళనాడుకు తరలించారు.

పుంగనూరులో క్షుణ్నంగా పరిశీలిస్తే..

పుంగనూరు నియోజకవర్గంలోనూ గ్రానైట్‌ క్వారీలు అధికంగా ఉన్నాయి. గతంలో లీజులు పొందిన వ్యక్తులు గత ఐదేళ్లలో ఇక్కడ పనులు చేయలేకపోయారు. మాట వినకపోతే అధికారులతో తనిఖీలు చేయించి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఇవన్నీ చాలావరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వారు విస్తీర్ణానికి మించి తవ్వారు. ఈ నేపథ్యంలో పుంగనూరులో ప్రతి ఒక్క క్వారీని క్షుణ్నంగా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాత లీజుదారులను కాకుండా వైకాపా హయాంలో ఎవరు తవ్వకాలు చేశారో గుర్తించి బాధ్యులుగా చేయాలి.

వసూళ్లపర్వం ఇలా..

మైనింగ్‌లో కొందరికే అనుమతులుండగా మరికొందరు వైకాపా నేతల అండతో రెచ్చిపోయారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ములో అప్పటి ప్రజాప్రతినిధి, కుటుంబసభ్యులకూ వాటాలు ముట్టజెప్పారనే విమర్శలున్నాయి. కుప్పం నియోజకవర్గంలోనూ అనధికారిక తవ్వకాలకు రూ.2 లక్షలు- రూ.3 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీ కొంత నగదు అందించారని చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని చంద్రబాబు నాయుడు అప్పటి సీఎస్‌ సమీర్‌శర్మకు లేఖ రాసినా చర్యలు మాత్రం తీసుకోలేదు. పెద్దిరెడ్డి ఆదేశాలతోనే అడుగులు ముందుకు పడలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని