logo

పేరుకే పురపాలికలు.. మార్కెట్లు లేక దైౖన్యం

జిల్లాలోని పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు ఏర్పడి 19 సంవత్సరాలైంది.

Published : 30 Jun 2024 02:20 IST

ఆరుబయటే మాంసం, చేపల విక్రయాలు

పుత్తూరు: ధర్మరాజుల ఆలయ ఎదురుగా రోడ్డు పక్కన చేపల మార్కెట్‌

జిల్లాలోని పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు ఏర్పడి 19 సంవత్సరాలైంది. వీటిలో కనీస మౌలిక వసతులు కరవే.. మార్కెట్లు లేక రైతులు రోడ్లపై తాము పండించిన పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. గత పాలకవర్గాలు కనీసం మార్కెట్లకు స్థలాలు సైతం కేటాయించలేదు.. ఈ నేపథ్యంలో రోడ్లపై క్రయవిక్రయాలు చేపడుతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

పుత్తూరు, న్యూస్‌టుడే:  పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీలు మేజరు పంచాయతీల నుంచి 2005 మున్సిపాలిటీలుగా ఆవిర్భవించాయి.. అయితే ఆ మేరకు మౌలిక వసతులు మాత్రం సమకూరలేదు.. ముఖ్యంగా మాంసం, చేపల మార్కెట్‌ లేక రహదారుల పక్కనే విక్రయిస్తుండటంతో సమస్య నెలకొంది.. ఆదివారమైతే పరిస్థితి మరీ చెప్పనక్కర్లేదు.. పలమనేరులో చేపల మార్కెట్‌ కోసం రూ.15 లక్షలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పులేదు.

  •  బహిరంగంగా జంతువధ.. మాంసం విక్రయాలు ఒక ఎత్తయితే.. కొందరు విక్రేతలు రహదారుల పక్కనే జంతువులను వధించడం సమస్యగా మారింది. పుత్తూరు పట్టణంలో కార్వేటినగరం రోడ్డు, ఎన్జీవో కాలనీ, గేటుపుత్తూరు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో, నగరిలో ఏకాంబరకుప్పం, నగరి ప్రధాన రహదారి, నగరి-నాగలాపురం రోడ్డు, పలమనేరులో గాంధీనగర్, ప్రధాన రహదారుల్లో ఈ పరిస్థితి ఎక్కువ. వ్యర్థాలను సైతం కాలువుల్లో పడేస్తుండటంతో మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారమైతే ప్రతి వీధి వద్ద ఇదే పరిస్థితి. చేపల మార్కెట్లు తాత్కాలికంగా ఉన్నా ఆయా వీధుల వద్ద ఏర్పాటు చేసి ఆ వ్యర్థాలు అక్కడే వదిలేస్తున్నారు. చేపలను శుభ్రం చేసిన నీరంతా రోడ్డుపైనే పారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
  • భూమిపూజ చేసినా..  పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వ హయాంలో చేపల మార్కెట్లు కోసం రూ.15 లక్షల చొప్పున రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఒక్క పలమనేరు మున్సిపాలిటీలో నిర్మాణం చేపట్టారు. పుత్తూరు, నగరిలో తెదేపా హయాంలో భూమిపూజ చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వైకాపా రావడంతో ఆ టెండర్లు రద్దు చేశారు. అనంతరం మరోసారి మంత్రి హోదాలో రోజా భూమిపూజ చేశారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇక మాంసం దుకాణాలు ఎక్కడిపడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

ప్రత్యేక దృష్టి సారిస్తాం..

రోడ్లపై ఎక్కడపడితే అక్కడ మాంసం దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రస్తుతం జంతువధశాల లేక ఇలా జరుగుతోంది. త్వరలోనే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు వచ్చిన వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. చేపల మార్కెట్ల ఏర్పాటుకు సంబంధించి ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణం జరిగేలా చూస్తాం.

 కేఎల్‌ఎన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్, పుత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని