logo

పింఛన్ల పండుగకు సన్నద్ధం

ఎన్నికల హామీలు అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి సంతకం చేయగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

Updated : 30 Jun 2024 05:28 IST

జిల్లాకు 2.71 లక్షల మంజూరు
రూ.181 కోట్లు విడుదల
సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పంపిణీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: ఎన్నికల హామీలు అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం సిద్ధమైంది.. ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి సంతకం చేయగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.. జిల్లాకు జులై నెలకు 2,71,696 పింఛన్లు.. రూ.181 కోట్లు మంజూరయ్యాయి.. ఈ మొత్తాన్ని ఇప్పటికే సచివాలయ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం దాదాపు పూర్తిచేశారు.. నాలుగో శనివారం బ్యాంకులకు సెలవున్నా పింఛన్ల మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకు అధికారులను ఆదేశించింది.. దీంతో సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వారి పరిధిలోని పింఛన్లకు సంబంధించిన మొత్తాన్ని డ్రా చేసి పంపిణీకి సంబంధించి మ్యాపింగ్‌ అయిన సిబ్బందికి అందజేయనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ సోమవారం ఉదయాన్నే పింఛన్లు లబ్ధిదారులకు ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే పంచాయతీ, మండల స్థాయి సిబ్బందిని వీటి పంపిణీకి వినియోగించనున్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పాటు, తెదేపా అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తం బకాయిలు కలిపి ఒకేసారి జులైలో ఇస్తామని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. ఈ మేరకు ఒకటో తేదీన ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి ఒక్కో నెలకు రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు, జులై నెల పింఛను రూ.4 వేలు మొత్తం రూ.7 వేలు ఒక్కో లబ్ధిదారుకు అందజేయనున్నారు. దివ్యాంగులకు రూ.6 వేలతో పాటు, గత మూడు నెలల బకాయిలు ఇవ్వనున్నారు. ఒకేసారి రెట్టింపు పింఛను నగదు చేతికి అందనుండటంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెదేపా అధికారంలోకి వచ్చాక మొదటిసారి పింఛను పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున పండుగలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ నుండగా, నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయిలో అధికారులు పాల్గొననున్నారు.

జులై నెలకు జిల్లాకు మంజూరు ఇలా..

వృద్ధాప్య పింఛన్లు 1,45,035, వితంతు 59,993, చేనేత కార్మికులు 2,572, దివ్యాంగులు 35,803, అభయ హస్తం 11,311, కల్లుగీత కార్మికులు 561, హిజ్రాలు 32, ఒంటరి మహిళలు 5,761, మత్స్యకారులు 249, డప్పు కళాకారులు 6,290, చర్మకారులు 796, చిత్రకారులు 70, సైనిక సంక్షేమ పింఛన్లు 61, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2,740, డయాలసిస్‌ రోగులు 422, మొత్తం 2,71,696 మంజూరయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని