logo

వాటర్‌గ్రిడ్‌ వెనక్కి!

ప్రజలందరికీ త్వరితగతిన రక్షిత మంచినీరు ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం)ను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇక్కట్లు తీర్చాలనే కృతనిశ్చయంతో ఉంది.

Published : 30 Jun 2024 02:21 IST

జేజేఎంతో జిల్లాకు నీరందించాలని సీఎం ఆదేశం
పనుల వేగవంతంపై దృష్టి పెట్టిన ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్గాలు

హంద్రీ- నీవా ప్రాజెక్టులోని కుప్పం బ్రాంచ్‌ కాలువ  

ఈనాడు, చిత్తూరు: ప్రజలందరికీ త్వరితగతిన రక్షిత మంచినీరు ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం)ను త్వరగా పూర్తి చేసి ప్రజల ఇక్కట్లు తీర్చాలనే కృతనిశ్చయంతో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన వాటర్‌గ్రిడ్‌ను వైకాపా అధికారంలోకి రాగానే పక్కనపెట్టేసి కొత్త ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుత చిత్తూరు జిల్లాలో ఇది ఒక్క పుంగనూరు నియోజకవర్గానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి జేజేఎం పథకాన్ని సక్రమంగా వినియోగించుకుని ఏడు నియోజకవర్గాల్లో నీటిఎద్దడి లేకుండా చేయాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న కుప్పంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకునేందుకు కసరత్తు చేయాలని ఆయన ఆదేశించారు.
 జిల్లాలో కరవు కాటకాలకు పేరుగాంచింది. వర్షాకాలంలోనూ గ్రామాలు, పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించే దుస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని ప్రకటించింది. 2022 చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2023 ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. వైకాపా నాయకులతో సన్నిహితంగా మెలిగే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. రూ.2,340 కోట్లతో పనులు చేపట్టేందుకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 30 నెలల్లో ఇంటింటికీ నీరు అందించాలని గడువు నిర్దేశించారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొంది. ఈ పథకం ఉద్దేశం కూడా గడప గడపకూ సురక్షిత జలాలు అందించడమే. 50 శాతం నిధులు కేంద్రమే ఇస్తుండగా కొత్తగా వాటర్‌ గ్రిడ్‌ ఎందుకనే విమర్శలు ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్గాల నుంచే వచ్చాయి. రాష్ట్రంలో అధికారం చేతులు మారడం.. అనవసర ఆర్థిక భారం ఎందుకనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును విరమించుకోవాలనే తలంపుతో ప్రభుత్వం ఉంది.

బిల్లులు చెల్లించకనే ఆలస్యం 

జేజేఎం పథకాన్ని సక్రమంగా అమలు చేసి ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్లు అందించాలని గతంలోనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 మార్చి నాటికి జిల్లాలోని అన్ని ఇళ్లకూ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్దేశం మంచిదే అయినా గుత్తేదారులకు వైకాపా ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఎక్కడికక్కడ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బకాయిల అంశాన్ని సర్దుబాటు చేసి జేజేఎంను పరుగులు తీయించాలని భావిస్తోంది.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ త్వరగా పూర్తి చేయించి 

ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చినా వాటికి నీరు ఎక్కడి నుంచే ఇవ్వాలన్నదే అసలైన ప్రశ్న. ఈనేపథ్యంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేసి చిన్నపాటి రిజర్వాయర్లలో నీరు నిల్వ చేసి భారీ ట్యాంకులకు పంప్‌ చేయనున్నారు. శుద్ధి చేసిన కృష్ణా జలాలను ఇళ్లకు అందించి గ్రామాల్లో నీటి ఎద్దడిని తరిమికొట్టనున్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులకు కూడా ఈ ఆదేశాలు అందాయి. ఒక్కసారి పనులు పూర్తయితే జిల్లాలో అటు సాగు, తాగునీటి కష్టాలకు చెక్‌ పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని