logo

పర్యావరణాన్ని కబళిస్తున్నా.. విచ్చలవిడి వినియోగం

ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడంలేదు.

Published : 30 Jun 2024 02:20 IST

పట్టణాల్లో మేటలు వేస్తున్న ప్లాస్టిక్‌ భూతం

పుంగనూరు, పలమనేరు, న్యూస్‌టుడే: ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడంలేదు. ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్‌ యథేచ్ఛగా వినియోగంలో ఉంది. ప్లాస్టిక్‌ భూతం పర్యావరణాన్ని కబళిస్తోంది. ప్రతి మనిషి నిత్యం సగటున 25-50 గ్రాముల మేర ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించకపోతే ప్లాస్టిక్‌తో పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. పుంగనూరు, పలమనేరు, కుప్పం, నగరి పురపాలికల్లో, చిత్తూరు కార్పోరేషన్‌లో ప్లాస్టిక్‌ వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది. హోటళ్లు, దుకాణాలు, మందుల షాపులు, చిల్లరకొట్టుల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తున్నారు.

తనిఖీలు నామమాత్రమే: మనిషి బయటకు ఖాళీ చేతులతో బయటకు వెళ్లి పండ్లు, కూరగాయలు, తినుబండారాలు మొదలు వస్త్రాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లడానికి ప్లాస్టిక్‌ కవర్లపైనే  వినియోగిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరమని తెలిసినా పుర అధికారులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమయ్యారు. చిత్తూరు కార్పోరేషన్‌లో అడపాదడపా తనిఖీలు చేస్తుండగా మిగిలిన పురపాలికల్లో ఈ ఆరు నెలల్లో తనిఖీలు చేపట్టలేదు.

కలిసిపోవాలంటే మూడు దశాబ్దాలు: ప్లాస్టిక్‌ సంచి భూమిలో కలిసిపోవాలంటే 300 ఏళ్లు పడుతుందని అంచనా. ఫలితంగా వర్షపు నీరు ఇంకడం లేదు. పర్యావరణ వేత్తలు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల క్రితమే 20 మైక్రాన్లలోపు మందం గల ప్లాస్టిక్‌ సంచులను నిషేధించింది. తర్వాత 40 మైక్రాన్ల లోపు గల ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులపై నిషేధం విధించింది. జనజీవితంలో భాగమైన ప్లాస్టిక్‌ సంచుల విక్రయాలు, వినియోగంపై వ్యాపారులు, వినియోగదారులను చైతన్యపరచడంలో పురపాలక అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ప్లాస్టిక్‌ సంచుల్లో వేడి పదార్థాలు తీసుకెళ్తే ఇథిలిన్, డయాక్సిన్లు వంటి రసాయనాలతో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తాం

ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ కవర్లను నిషేధిస్తాం. ప్రతి కార్పోరేషన్, పురపాలికలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. ప్రజలు సహకరించి వస్త్ర సంచులు, క్యారీ బాక్సులు వినియోగించేందుకు ముందుకు రావాలి.

 వీవీఎస్‌ మూర్తి, ప్రాంతీయ సంచాలకులు, అనంతపురం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని