logo

Crime News: భార్యను నమ్మించి హతమార్చిన భర్త

భర్తతో విడిపోయిన మహిళ అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది.

Updated : 29 Jun 2024 08:28 IST

హత్యకు గురైన భారతి (పాతచిత్రం)

మదనపల్లె నేరవార్తలు, నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: భర్తతో విడిపోయిన మహిళ అతని వద్ద ఉన్న బిడ్డలను తీసుకెళ్లేందుకు వచ్చి దారుణహత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీ దివిటివారిపల్లెలో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళను భారతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని నాగలకట్ట వీధికి చెందిన రంగయ్య, సాలమ్మల కుమార్తె భారతి (26)కి తొమ్మిదేళ్ల కిందట పలమనేరులోని నాగరాళ్లవీధికి చెందిన గణపతితో వివాహమైంది. వీరికి గంగాధర్‌ (6), రోహిత్‌ (4) పిల్లలు. గణపతి అతని కుటుంబ సభ్యులు భారతిని తరచూ వేధింపులకు గురి చేసేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పంచాయితీ చేయగా వారి సమక్షంలోనే గణపతి తన భార్యపై దాడి చేయడంతో ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లిపోయారు. రెండు నెలల కిందట పెనుమూరు మండలం కార్తికేయపురంలో ఉన్న చిన్నమ్మ జ్యోతి వద్దకు వచ్చింది. అక్కడ ఆమె నెల్లూరుకు చెందిన రవితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా ఉంటోంది. నెల రోజుల కిందట అతనితో వెళ్లిపోయింది. ఈ నెల 27న గణపతి తన భార్య భారతికి ఫోన్‌ చేసి బిడ్డలను తాను పోషించలేనని వచ్చి తీసుకెళ్లాలని నమ్మించాడు. దీంతో భారతి బిడ్డలను తీసుకెళ్లేందుకు గురువారం పలమనేరు వచ్చింది. వీరిద్దరు కలసి నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లె వద్ద ఉన్న బాహుదా నది వద్ద గడిపారు. గణపతి పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పొలానికి నీరు కట్టేందుకు వచ్చిన దివిటివారిపల్లెకు చెôదిన మంజునాథ్‌ అలియాస్‌ రామాంజులు హత్య చూడటంతో అతనిపై దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మంజునాథ్‌ను కుటుంబ సభ్యులు తిరుపతి ఆసుపత్రిలో చేర్చారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐలు సద్గురుడు, వల్లిబసు, యువరాజ్, తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు కొంత దూరంలో గొల్లపల్లె వద్ద ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు. శుక్రవారం రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి కొంత దూరం వరకు వెళ్లి ఆగిపోయింది. మృతురాలి తల్లి సాలమ్మ, తమ్ముడు మునికృష్ణ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకేసు దర్యాప్తునకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు చెప్పారు.

ఘటనా స్థలంలో పోలీసు జాగిలంతో తనిఖీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని