logo

అనర్హులకు పింఛన్లు

అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది.

Published : 03 Jul 2024 04:51 IST

వైకాపా ప్రభుత్వంలో అర్హత లేకపోయినా మంజూరు
తప్పుడు సదరం పత్రాలతో సొమ్ము పొందుతున్న వైనం
ఈనాడు డిజిటల్, అనంతపురం, న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, ఆత్మకూరు

అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమకు అనుకూలమైన వాలంటీర్లను అడ్డంపెట్టుకుని సంక్షేమ పథకాల పేరుతో వైకాపా సానుభూతిపరులకు ప్రజాధనాన్ని దోచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఆసరా పింఛను లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలే ఇందుకు నిదర్శనం. తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమవారం మొదటిసారి పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయడంతో వేలాది మంది అనర్హులు బయటపడ్డారు. గత ప్రభుత్వంలో దివ్యాంగులకు రూ.3 వేలు పింఛను అందించారు. వైకల్యం ఎంత ఉందో నిర్ధారించడానికి సదరం శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తించారు. వైకాపా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు వైకల్యం లేకపోయినా ధ్రువపత్రాలు జారీ చేశారు. కొందరు వైద్యులు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేసి తప్పుడు పత్రాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు వైద్యులపై చర్యలు తీసుకున్నారు. అనర్హులను ఏరివేసే ప్రక్రియను పూర్తిచేయలేదు.

ఇప్పటికీ వందలాది మంది తప్పుడు సదరం పత్రాలతో పింఛను సొమ్ము తీసుకుంటున్నారు. తెదేపా కూటమి సర్కారు దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తోంది వందలాది మంది తప్పుడు పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు సచివాలయ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది.

మగ్గం పని చేయకున్నా..

చేనేత మగ్గం ఎరుగని వైకాపా నాయకులు అధికార బలంతో గత ప్రభుత్వంలో నెలనెలా పింఛన్‌ సొమ్ము అప్పనంగా మేసేసిన ఉదంతం చెన్నేకొత్తపల్లి గ్రామ సచివాలయం-2 పరిధిలో వెలుగులోకి వచ్చింది. సచివాలయ పరిధిలోని గ్రామాలలో మగ్గం పని చేయకపోయినా తాము చేనేత కార్మికులమంటూ ఐదేళ్లపాటు పింఛన్‌ సొమ్ము కాజేశారు. సచివాలయం పరిధిలో తొమ్మిది మంది చేనేత పింఛన్లు పొందుతున్నారు. మండల కేంద్రంలో నలుగురికి మాత్రమే మగ్గాలు ఉన్నాయి. వారిలో ఏ ఒక్కరికీ పింఛను రావడం లేదు. చెన్నేకొత్తపల్లి మండలంలో మొత్తం 70కి మించి మగ్గాలు లేవు. 808 మందికి సొమ్ము అందిస్తుండటం గమనార్హం.

కొన్ని ఉదంతాలు..

  • రాప్తాడు మండలం మరూరుకు చెందిన వైకాపా నాయకుడు దివ్యాంగ పింఛను పొందుతున్నారు. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైనట్లు ప్రతినెలా రూ.5 వేలు తీసుకున్నారు. సదరు వ్యక్తికి ఎలాంటి పక్షవాతం లేదు. మొన్నటివరకు వైకాపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వంలో సదరు వ్యక్తికి రూ.15 వేలు పింఛను అందించడం గమనార్హం.
  • ఆత్మకూరు మండలం పి.యాలేరు, పి.సిద్ధరాంపురం గ్రామాల్లోని వైకాపా సానుభూతిపరులకు అర్హత లేకపోయినా పింఛన్లు మంజూరు చేశారు. భార్యభర్తలు కలిసి ఉన్నప్పటికీ విడాకులు తీసుకున్నట్లు చూపి ఇద్దరూ సొమ్ము పొందడం గమనార్హం. పి.యాలేరులో వయస్సు లేకపోయినా ఆధార్‌లో మార్పులు చేసి కొందరు పింఛన్లు పొందుతున్నారు.
  • గొందిరెడ్డిపల్లికి చెందిన వైకాపా నాయకుడు వైకల్యం ఉన్నట్లు సదరం పత్రం తీసుకుని ప్రతి నెలా రూ.3 వేలు పింఛను అందుకున్నారు. కొత్త ప్రభుత్వం ఆయనకు రూ.6 వేలు పింఛను అందిస్తోంది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోగినేపల్లిలో భర్త ఉన్నప్పటికీ ఒంటరి మహిళగా పింఛను పొందుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని