logo

తుంగభద్రకు పెరిగిన వరద

తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు.

Published : 03 Jul 2024 04:42 IST

అన్నదాతల్లో చిగురించిన ఆశలు

తుంగభద్ర ప్రాజెక్టుకు చేరిన వరద నీరు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయానికి (టీబీ) వరద పోటెత్తింది. మూడు రోజులుగా టీఎంసీకి పైగా వరద చేరుతోంది. రెండు వారాలుగా ఊరించిన వరుణుడు కరుణించాడు. తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో వానలు జోరుగా కురుస్తుండటంతో జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. గతనెల 29న 1,819 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో...మంగళవారం ఒక్కసారిగా 13,410 క్యూసెక్కులకు పెరగడం విశేషం. దీంతో హెచ్చెల్సీ ఆయకట్టు అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే ఆగస్టు మొదటి వారంలో కాలువకు నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంది. ఈలోపు నార్లు పోసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తుంగభద్ర పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, దావణగెర, అగుంబే, వంటి ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.909 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ కింద 2.85లక్షల ఎకరాలు ఉంది. ఈదఫా టీబీ డ్యాంకు 172 టీఎంసీలు లభ్యం అవుతాయని అంచనా వేశారు. హెచ్చెల్సీ వాట 26.368 టీఎంసీలు వస్తాయి. కనీసం లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగు చేసేందుకు అవకాశం ఉంది. ఏటా ఖరీఫ్‌లో తుంగభద్రకు వచ్చే వరద నీరే కీలకం. మరోవైపు జూన్‌లో సాధారణ వర్షపాతం 61 మి.మీ ఉండగా.. 147.7 మి.మీ. వర్షపాతం నమోదైంది.

మరమ్మతు పనులు వేగవంతం

ఇటీవల హెచ్చెల్సీ ప్రధాన కాలువ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్లు సమీపంలో 112 కి.మీ. వద్ద పనులు పూర్తి చేశారు. డి.హీరేహాళ్‌ మండలం చెర్లోపల్లి సమీపాన 119.638 కి.మీ. వద్ద యూటీకి మరమ్మతు పనుల్లో వేగం పెంచారు. రానున్న ఐదు రోజుల్లో పని పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే తరహాలో ఉరవకొండ మండలం నింబగల్లు సమీపంలోని 181.100 కి.మీ.వద్ద కాలువ గట్టు తెగిపోయింది. రెండు మూడు రోజుల్లో ఈ పనికి శ్రీకారం చుట్టనున్నారు. నీరు విడుదల చేసే నాటికి ఎంపిక చేసిన పనులన్నీ పూర్తి చేయనున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ పేర్కొన్నారు.


నీటి శుద్ధి ప్లాంటులో పురుగు మందు కలిపిన నలుగురు వైకాపా కార్యకర్తల అరెస్టు

కణేకల్లు, న్యూస్‌టుడే: కణేకల్లు మండలం తుంబిగనూరు గ్రామంలో నీటి శుద్ధి ప్లాంటులో పథకం ప్రకారమే పురుగు మందు కలిపి.. దురాగతానికి ఒడిగట్టిన ఘటనలో వైకాపాకు చెందిన నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సమాచారాన్ని పోలీసులు మీడియా చెప్పకుండా వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేయడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడంతో గ్రామంలో వైకాపా సర్పంచి ఫణీంద్ర ఆధీనంలో ఉన్న ప్లాంటు నిర్వహణను తమకు అప్పగించాలని గత నెలలో తెదేపా నాయకులు ఎంపీడీఓ గూడెన్నకు విన్నవించారు. తెదేపా నాయకుల ఆధీనంలోకి వెళితే తనకు మర్యాద ఉండదన్న దురుద్దేశంతో సర్పంచి ఇతరులతో కలిసి దురాగతానికి పాల్పడ్డాడు. నెపాన్ని తెదేపాపై నెట్టివేయడానికి గత నెల 14న రాత్రి పురుగు మందు కలిపినట్లు తేల్చారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో కళ్యాణుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, కణేకల్లు ఎస్సై శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి.. కేసును ఛేదించాయి. దుశ్చర్యలో ప్రధాన భూమిక పోషించిన ఫణీంద్ర పరారీలో ఉన్నాడని, ఫణీంద్ర తండ్రి టి.తిప్పయ్య, తమ్ముడు టి.ఆనందగౌడ, చిన్నాన్న కొడుకు కొట్రేగౌడతో పాటు తలారి హనుమంతును గ్రామంలోని బస్టాప్‌ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని