logo

సీఈ, ఎస్‌ఈ పోస్టుల భర్తీపై ఉత్కంఠ

జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది.

Published : 03 Jul 2024 04:39 IST

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: జిల్లా జలవనరుల శాఖలో కీలకమైన రెండు పోస్టులపై ఉత్కంఠకు తెర లేచింది. పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కోసం ఇంజినీర్ల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. నువ్వా..నేనా అన్న రీతిలో రాష్ట్ర స్థాయిలో కొందరు అధికారులు విజయవాడలోనే మకాం వేసి పైరవీ చేస్తున్నారు. ఈ శాఖ జిల్లా ముఖ్య ఇంజినీరు (సీఈ), చిన్న నీటిపారుదల (ఎంఐ) పర్యవేక్షక ఇంజినీరు (ఎస్‌ఈ) పోస్టులు జూన్‌ ఆఖరులో ఖాళీ ఏర్పడ్డాయి. ఈ రెండు పోస్టుల్లో శ్రీనివాసులురెడ్డి పని చేస్తూ పదవీ విరమణ పొందారు. సాధారణంగా పదవీ విరమణ పొందే రెండు రోజుల ముందే ఎఫ్‌ఏసీ బాధ్యతలకు ఎవరికి ఇస్తారన్న దానిపై ముందుగానే తగిన ఉత్తర్వు వెలువడటం ఆనవాయితీ. ఈదఫా మూడు రోజులు గడిచినా ఎవరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించే ఉత్తర్వులు రాలేదు. వైకాపా ప్రభుత్వంలో ఎఫ్‌ఏసీ బాధ్యతలు ఇష్టారాజ్యంగా అప్పగిస్తూ వచ్చారు. అనుభవం, సీనియారిటీతో నిమిత్తం లేకుండా జూనియర్లకు ఉన్నత పదవులు కట్టబెట్టారు. ఇందులోనూ ఒకే సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. ఒక్కొక్కరిని రెండు మూడు పోస్టుల్లో నియమించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టడానికే ప్రస్తుత తెదేపా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అనుభవం, సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పైరవీలకు విజయవాడలో మకాం..

హంద్రీనీవా, హెచ్చెల్సీ, ఎంఐ ప్రాజెక్టులకు సీఈ ఒకరే ఉంటారు. ఈ పోస్టు ఎంతో కీలకం. ఇప్పటికే ఈ పోస్టు కోసం హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఈయనే సీనియర్‌ ఎస్‌ఈ. జిల్లాను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఈయనకే సీఈ పోస్టు వరించనుంది. ఇతర జిల్లాలను తీసుకుంటే మరొకరికి అవకాశం వచ్చే వీలుంది. ఎంఐ ఎస్‌ఈ పోస్టు కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. కడపకు చెందిన కమతం శ్రీనివాసులు, హెచ్చెల్సీ డివిజన్‌ ఈఈ శ్రీనివాసులు, హంద్రీనీవా ఈఈ నారాయణనాయక్‌.. మధ్య పోటీ నడుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరు ఇద్దరు విజయవాడలోనే మకాం వేసి పైరవీ చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని