logo

వేలిముద్రలు తీసుకొని.. పింఛన్‌ సొమ్ము కాజేసి

శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది.

Updated : 03 Jul 2024 05:59 IST

రూ.5.45 లక్షలు స్వాహా చేసిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌

శెట్టూరు: ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు, తెదేపా నాయకులు

శెట్టూరు, న్యూస్‌టుడే: శెట్టూరు గ్రామ సచివాలయంలో పనిచేసే సంక్షేమ సహాయకుడు మల్లికార్జున పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు ఇవ్వకుండా రూ.5.45 లక్షలు స్వాహా చేసినట్లు మంగళవారం బయటపడింది. 1వ తేదీ లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని పింఛన్‌ సొమ్మును ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. లబ్ధిదారులు సమస్యను తెదేపా నాయకులకు తెలపడంతో వారు ఎంపీడీవో నరసింహమూర్తికి మంగళవారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. పెంచిన పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి శనివారం బ్యాంకు నుంచి కార్యదర్శి సెలవులో ఉండటంతో రూ.42.39 లక్షలు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున డ్రా చేసి నగదును తీసుకొచ్చాడు. ఆ మెత్తాన్ని మిగతా క్లష్టర్లకు ఇచ్చి ఆయన పంచాల్సిన వాటిలో కొందరికి పంపిణీ చేశాడు. శెట్టూరు, బసంపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులతో డబ్బు వేరేచోట పెట్టాను వెళ్లి తెస్తాను, వేలిముద్రలు వేయండని మొదటిరోజు నమ్మించడంతో వారంతా వేశారు. మంగళవారం సైతం డబ్బులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వాపోయారు. ఇంకా చాలా మందికి ఇవ్వలేదని ఫిర్యాదు రావడంతో ఎంపీడీవో నరసింహమూర్తి అతడిని కార్యాలయానికి పిలిపించి విచారించారు. తాను రూ. 5.45 లక్షలు వాడుకున్నట్లు మల్లికార్జున ఒప్పుకొని రాతపూర్వకంగా రాసిచ్చాడని ఎంపీడీవో తెలిపారు. ఇదే విషయాన్ని పై అధికారులకు తెలిపామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మల్లికార్జున అక్రమాలపైన, కాజేసిన సొమ్ము రికవరీకి శెట్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. పింఛన్‌ సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ విషయమై ఎస్సై రామ్‌భూపాల్‌ను వివరణ కోరగా ఎంపీడీవో ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు.  

రూ.లక్ష నగదుతో మరో ఉద్యోగి..

గుడిబండ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ సొమ్ముతో డిజిటల్‌ అసిస్టెంట్‌ పరారైన ఘటన గుడిబండ మండలంలో చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన రవికుమార్‌ ముతుకూరు సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జులై ఒకటిన సోమవారం ఇటికేపల్లిలో 83 మంది లబ్ధిదారులకు పింఛన్‌ అందించే బాధ్యత అప్పగించి అతడికి రూ.4.68 లక్షల నగదు అందించారు. గ్రామానికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. కొందరితో వేలిముద్రలు తీసుకున్నా పడలేదని చెప్పి వారికి నగదు చెల్లించలేదు. ఇంకా కొందరికి పింఛన్‌ పంపిణీ చేయకుండానే ఉడాయించి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. మంగళవారం లబ్ధిదారులు లబోదిబో మనడంతో గుడిబండ ఈవోఆర్డీ నాగరాజ్‌ నాయక్‌ సూచన మేరకు ముతుకూరు పంచాయతీ కార్యదర్శి అరుణ గుడిబండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యదర్శి అరుణ మాట్లాడుతూ రికార్డు మేరకు రూ.83,500, అన్‌ రికార్డు మేరకు రూ.1,04,000 చెల్లించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు రవికుమార్‌ స్థానిక స్టేషన్‌ వద్ద హాజరయ్యాడు. ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రూ.52 వేల నగదు చెల్లించాడని, మిగతా రూ.31,500 మొత్తాన్ని చెల్లించాల్సి ఉందన్నారు. ఫోన్‌ పే ద్వారా తెప్పించి కడితే పంచాయతీ కార్యదర్శికి అప్పగిస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని