logo

ఆక్రమణలపై మున్సిపల్‌ అధికారుల కొరడా

అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు.

Published : 03 Jul 2024 04:21 IST

అడపాలవీధిలో మున్సిపల్‌ అధికారులు కూల్చేసిన అక్రమ నిర్మాణం

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను మంగళవారం మున్సిపల్‌ అధికారులు కూల్చేశారు. కదిరిలో విలాసవంత ప్రాంతమైన అడపాలవీధిలో వైకాపా నాయకుడు శివారెడ్డి నిర్మించిన షెడ్డును పొక్లెయిన్‌తో కూల్చి వేశారు. సర్వేనంబరు 206లోని 0.90 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కాంగ్రెస్‌ హయాంలో ఇక్కడ కొందరు సంపన్నులు ఇళ్ల పట్టాలు పొందారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులతో ప్రభుత్వం ఆ పట్టాలను రద్దు చేసింది. వైకాపా అధికారంలోకి రాగానే 206 సర్వేనంబరులోని సుమారు రెండుసెంట్ల స్థలంలో వైకాపా నాయకుడు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు గతంలో ప్రయత్నించారు. అధికారులు అడ్డుకోవడంతో కొద్దిరోజులు ఆగిన ఆ నాయకుడు ఆ తర్వాత రాత్రికి రాత్రే రేకులషెడ్డు వేసుకున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా వైకాపా పాలనలో అధికారులు షెడ్‌ను తొలగించే ధైర్యం చేయలేదు. ప్రభుత్వం మారడంతో మంగళవారం మున్సిపల్‌ అధికారులు పొక్లెయిన్‌ల సాయంతో శివారెడ్డికి చెందిన షెడ్డును కూల్చేశారు. వీటితో పాటు హిందూపురం రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో వైకాపా సోషియల్‌ మీడియా కార్యకర్త పునాదులు వేసుకున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న మున్సిపల్‌ అధికారులు వాటిని పూర్తిగా తొలగించేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని