logo

ఆసుపత్రి అస్తవ్యస్తం.. వ్యాధిగ్రస్థులు సతమతం

హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్‌కుమార్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయి.

Published : 03 Jul 2024 04:20 IST

నూతన సూపరింటెండెంట్‌కు సవాల్‌గా దీర్ఘకాల సమస్యలు

ఆసుపత్రి ఓపీ వద్ద బారులు

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రోహిల్‌కుమార్‌కు సవాల్‌గా నిలుస్తున్నాయి. ఈయన వైకాపా ప్రభుత్వ పాలనలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసి కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అదేపదవికి అయన్ను నియమించారు. గత తెదేపా పాలనలో ఉత్తమ సేవలు అందించి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకొన్న ఆసుపత్రి వైకాపా పాలనలో అధ్వానంగా మారింది. దీనివల్ల ప్రజలు ఆసుపత్రికి దూరమై ప్రైవేట్‌ బాటపట్టారు. ప్రస్తుతం మళ్లీ తెదేపా ప్రభుత్వం రావటంతో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరు మాసాల్లో ఆసుపత్రి సేవలు పూర్వస్థితికి తీసుకురావాలని తొలి ప్రాధాన్యంగా నిర్ణయించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొంటున్నారు. ఈ సమయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా రోహిల్‌ కుమార్‌ నియమితులు కావటం అతని సమర్థతతకు పరీక్షగా మారింది.

  • ఆసుపత్రిలో దాదాపు ఏడేళ్ల నుంచి సీటీ స్కాన్‌ మూలనపడింది. దీని సేవలు ప్రజలకు ఎంతో అవసరం. దీని మరమ్మతులకు పెద్దఎత్తున నిధులు అవసరం ఉన్నందున ఇంతకాలం పట్టించుకోలేక పోయారు. ఉన్న దానికి మరమ్మతులు చేయటం, లేదా కొత్తది ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగం.
  • నిత్యం 1200 మంది వైద్యానికి వస్తున్నారు. వీరందరికీ ఒకే మందుల కౌంటర్‌ ఉన్నందున గంటల తరబడి వరుసలో నిలిచోవాల్సి వస్తోంది.  వైద్యులు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత ఉంది.  దోబీఘాట్‌ గదిలో శవపరీక్షలు చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన అధునాతన శవపరీక్ష గది అందుబాటులోకి తీసుకురావాలి..
  • ఆసుపత్రిలో తగిన మందులు అందుబాటులో లేక ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరకు మందులు దొరికే జనరిక్‌ ఔషధ దుకాణం ఉన్నా ఉపయోగపడటం లేదు. దీని సేవలపై అవగాహన కల్పించాలి.
  • డయాలసిస్‌ కేంద్రం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రక్త పరీక్షలు నిర్వహించేందుకు అధునాతన ఆటోమెషన్‌లు అందుబాటులో ఉన్నా వాటిని ఇప్పటివరకు వినియోగించక అలానే ఉంచారు.
  • ప్రధాన ద్వారం ఇరుకుగా ఉండటం, అక్కడే ద్విచక్రవాహనాలు అడ్డుగా ఉండటంతో అంబులెన్స్‌లు రాకపోకలు సాగించడానికి నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్య లేకుండా చూడాలి.  ఆసుపత్రి ఆవరణం పందులు, పశువులకు నిలయంగా మారింది. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం లోపించకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సమస్యల పరిష్కారానికి చర్యలు

రోహిల్‌కుమార్, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి, హిందూపురం

ఆసుపత్రికి గతంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించినందున సమస్యలపై అవగాహన ఉంది. ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లి అతని సహకారంతో ప్రాధాన్య క్రమంలో ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొంటాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని