logo

పాఠశాలలు ప్రారంభం.. పనులు అర్ధాంతరం

అనంత నగరంలోని కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు.

Published : 01 Jul 2024 04:37 IST

గత ప్రభుత్వ తీరుతో విద్యార్థులకు తప్పని అవస్థలు

అనంత నగరంలోని కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం ఇది. నాడు-నేడు పథకం కింద గత ప్రభుత్వం 4 అదనపు గదులను మంజూరు చేసింది. అందులో రెండు మాత్రమే పూర్తి చేశారు. వాటికి తలుపులు, కిటికీలు అమర్చలేదు. మరో రెండు పైఅంతస్తులో నిర్మించాల్సి ఉంది. తలుపులు, కిటికీలు సరఫరా పనులను రాష్ట్రవ్యాప్తంగా ఒకే గుత్తేదారుకు అప్పగించింది. వారు అనేక పాఠశాలలకు కిటికీలు, తలుపులు సరఫరా చేయలేదు. వాటిని అమరిస్తే ఆ గదుల్లో తరగతులు నిర్వహించడానికి వీలుంటుంది.

రుద్రంపేటలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఇది. నాడు-నేడు పథకం కింద పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ నిర్మించారు. గోడలకు రంగులు వేయలేదు. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బడులకు ఓ ఏజెన్సీకి రంగులు వేసే పనులు కట్టబెట్టారు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాల గోడలకు రంగులు వేయడం లేదు. దీంతో పాఠశాలల గదులు, గోడలు అధ్వానంగా ఉన్నాయి.

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేస్తామని ప్రగల్భాలు పలికింది. ఐదేళ్ల పాలనలో ఒక్క పాఠశాలలో కూడా పనులు పూర్తి చేయలేదు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించి 16 రోజులు పూర్తయినా.. నేటికీ బడుల్లో నాడు-నేడు పనులు పూర్తి కాలేదు. అనంతపురం జిల్లాలో నాడు-నేడు పథకం కింద 1,078 పాఠశాలలు ఎంపిక చేసింది. సౌకర్యాల కల్పనకు రూ.386 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. గత ప్రభుత్వం మంజూరు చేసినా రూ.149 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ నిధులు కూడా సకాలంలో విడుదల చేయలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నాడు-నేడు రెండో విడత పథకం 2022లో ప్రారంభించారు. 2024 జులై నాటికి కూడా పూర్తి చేయలేదు. ఇటీవల తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ‘నాడు-నేడు’ను ‘స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూవ్‌మెంట్‌’గా పేరు మార్చింది. ఈ పథకం ద్వారా పాఠశాలలను ప్రగతి పథంలో నడిపిస్తారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


హెచ్‌ఎంలు సమాచారమిస్తే పూర్తి చేయిస్తాం

పాఠశాలలకు కిటికీలు, తలుపులు రాలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పనులు పూర్తయ్యాయని, కిటికీలు, తలుపులు రాలేదని వారు యాప్‌ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే తెప్పించడానికి చర్యలు తీసుకుంటాం.

శివకుమార్, ఈఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ


బిల్లులు రాక.. నిర్మాణం సాగక

మానిరేవు ప్రాథమికోన్నత పాఠశాలలో రంగులు వేయని అదనపు గదులు

కళ్యాణదుర్గం గ్రామీణం: కళ్యాణదుర్గం మానిరేవు మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల రెండో విడత నాడు-నేడు కింద ఎంపికైంది. ఆరు తరగతి గదులు ఉండగా, 1-8వ తరగతి వరకు 135 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.22 లక్షలతో రెండు అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. గదుల నిర్మాణం పూర్తి కాగా బండలు, రంగులు ఇంకా వేయలేదు. ఇంకా రూ.6,18,887 సొమ్ము రావాల్సి ఉంది.    
దీంతో పనులు ముందుకు సాగడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని