logo

ఐదేళ్లు నిర్లక్ష్యం.. ప్రగతికి శాపం

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి.

Updated : 01 Jul 2024 05:42 IST

రూ.20 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను గాలికొదిలేసిన గత ప్రభుత్వం

ఐదేళ్ల కిందట నిలిచిన ఇండోర్‌ క్రీడా స్టేడియం పనులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. గుంతకల్లు పట్టణంలో ప్రగతికి శాపంగా మారింది. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను కొనసాగించకుండా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆపివేసింది. ఫలితంగా నిర్మించిన నిర్మాణాలు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 శాతం లోపు ఉన్న నిర్మాణాలను ఆపివేయాలని ఆదేశించడంతో వాటి పనులను గుత్తేదారులు నిలిపివేశారు.

గుంతకల్లులో 2019లో మైనార్టీ బాలబాలికల ఉర్దూ రెసిడెన్షియల్‌ పాఠశాల కోసం రూ.18 కోట్లతో గదుల నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం నుంచే శంకుస్థాపన చేశారు. పనులు జరుగుతుండగా వైకాపా ప్రభుత్వమే పనులను నాలుగు సంవత్సరాల కిందట ఆపివేసింది. ఇక తెదేపా హయాంలో పట్టణంలోని ఎస్‌జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.2 కోట్లతో 2018లో ఇండోర్‌ క్రీడా స్టేడియం పనులు చేపట్టింది. ఈ పనులను కూడా వైకాపా ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందట ఆపివేసింది.

అర్ధాంతరంగా ఆగిన రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాలు

నిర్మాణాలు ఉంటాయో.. కూలుతాయో!

పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఉర్దూ రెసిడెన్షియల్‌ పాఠశాల, ఇండోర్‌ క్రీడా స్టేడియం నిర్మాణాలు ఉంటాయో కూలుతాయో తెలియని పరిస్థితికి చేరుకున్నాయి. ఇండోర్‌ స్టేడియం లోపల రకరకాల చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. ఫలితంగా గోడలు కూలిపోతాయేమోనని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. పనులు పూర్తిచేసిన తరువాత బిల్లులు చెల్లించకపోతే తాము అప్పులపాలు అవుతామేమోనని భయపడి గుత్తేదారులు పనులను పూర్తిచేయడానికి సాహసించడం లేదు. గుంకతల్లులోని క్రీడాకారులు వివిధ క్రీడలను ఆడటానికి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పనులను పూర్తిచేయాలని క్రీడాకారులు, రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాలను త్వరగా పూర్తిచేసి తమ పిల్లలను ఆదుకోవాలని మైనార్టీలు కోరుతున్నారు.

భవనాలు పూర్తి చేసేందుకు చొరవ

మున్సిపాలిటీలో చేపట్టి అర్ధాంతరంగా ఆపివేసిన రెసిడెన్షియల్‌ పాఠశాల, ఇండోర్‌ క్రీడా స్టేడియంల నిర్మాణాలను పూర్తిచేసే విధంగా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళతాం. పనులు విద్యార్థులు, క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం.

భవాని, మున్సిపల్‌ అధ్యక్షురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని