logo

రద్దుకు తక్షణ నిర్ణయం.. పునరుద్ధరణలో జాప్యం

కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించారు.

Published : 01 Jul 2024 04:32 IST

కరోనా తర్వాత పలు రైళ్ల నిలిపివేత..
నేటికీ పట్టాలెక్కించేందుకు మీనమేషాలు
అనంతవాసులకు కష్టాలు

విజయవాడ ప్యాసింజర్‌ (పాతచిత్రం)

అనంతపురం(రైల్వే): కరోనా తర్వాత కొన్ని రైళ్లు పట్టాలెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ మాత్రం చర్యలు లేవు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రైళ్లను రద్దు చేసిన విషయం విధితమే. తర్వాత దశల వారీగా రైళ్లను పట్టాలెక్కించారు. తొలుత రాజధాని రైళ్లు తర్వాత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఆ తర్వాత ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించారు. ప్యాసింజర్‌ రైళ్లను మొన్నటి దాకా ప్రత్యేక ప్యాసింజర్లుగా నడపటంతో ఛార్జీలు ఎక్స్‌ప్రెస్‌ తరహాలో వసూలు చేశారు. వాటిని కూడా ఇటీవల సాధారణ ఛార్జీలుగా మార్పు చేశారు. ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకటి, రెండు రైళ్లు ఇప్పటికీ నడవక అనంత రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికీ ప్రారంభించని ప్యాసింజర్‌..

బెంగళూరు దండు-విజయవాడ ప్యాసింజర్‌ (53506/07) రైలు ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కరోనా తర్వాత ప్యాసింజర్‌ రైలు మాత్రం నడవటం లేదు. తొలుత రైల్వే అధికారులు డబ్లింగ్‌ పనుల తర్వాత నడుపుతామన్నారు. ఆ తర్వాత ఆ రైలును మరచిపోయారు. ఈ రైలు ఉదయం 8 గంటలకు బెంగళూరులో బయలుదేరితే అనంతపురం, గుత్తి, గుంతకల్లు, డోన్, నంద్యాల మీదుగా విజయవాడకు ఉదయం 6 గంటలకు చేరుకునేది. అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ రైలులోనే వారాంతాల్లో వెళ్లే వారు. ఎక్కువ ప్రయాణ సమయం ఉన్నప్పటికీ తక్కువ ధరతో విజయవాడకు తీసుకెళ్లే రైలు కావడం, జిల్లాలో పగటి వేళలో నడుస్తూ ప్రతి చిన్న రైల్వే స్టేషన్‌లోనూ ఆగుతూ వెళ్తుండటంతో గ్రామీణ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 7 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు అనంతపురానికి చేరుకొని బెంగళూరు వెళ్లేది. దీంతో పగటి వేళలో బెంగళూరు వైపు వెళ్లే ప్రయాణికులకు అనుకూలంగా ఉండేది. ఈ సమయంలో ఇతర రైళ్లు లేకపోవడంతో విజయవాడ ప్యాసింజర్‌కు డిమాండు కొనసాగుతూ వచ్చింది. ఇంతటి ప్రజాద]రణ కలిగిన ఈ రైలు ఇప్పటికీ నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

‘దారి’ తప్పిన మైసూర్‌- శిర్డి..

అనంతపురం మీదుగా వారానికి ఒక రోజు మైసూర్‌- శిర్డి రైలు(16217/18) నడిచేది. ఈ రైలు సోమవారం మైసూర్‌ నుంచి శిర్డీకి వెళ్లి బుధవారం రాత్రి శిర్డీ నుంచి మైసూర్‌కు వెళుతుంది.  జిల్లాకు చెందిన బాబా భక్తులు ఈ రైలులో శిర్డీ వెళ్లడానికి వీలుగా ఉండేది. కరోనా తర్వాత ఈ రైలును తుముకూరు, బళ్లారి మీదుగా శిర్డీకి వెళ్లేలా దారి మార్పు చేశారు. అప్పట్లో పార్లమెంటు సభ్యులు ఈ రైలు పట్టాలెక్కలేదని అడిగితే బెంగళూరు- గుత్తి డబ్లింగ్‌ జరుగుతుండటంతో మార్పు చేశామని చెప్పారు. కానీ డబ్లింగ్‌ పనులు పూర్తి అవుతున్నాయి. అన్ని రైళ్లు అనంతపురం మీదుగా నడుస్తున్నా ఈ రైలు నడపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ రైలును తుమకూరు, బళ్లారి మీదుగానే శాశ్వతంగా నడుపుతామని ఇప్పటికే రైల్వే అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతం హిందూపురం, అనంతపురానికి చెందిన భక్తులు శిర్డీ వెళ్లడానికి కేవలం బెంగళూరు సిటీ- న్యూదిల్లీ (12628-27) రైలు మాత్రమే ఉంది. ఈ రైలు కోపర్‌గావ్‌ దాకా వెళుతుంది. ఈ రైలులో సీట్లు దొరకాలంటే 4 నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేయించుకోవాలి. మరో రైలు చెన్నై-శిర్డీ వారంలో ఒక రోజు ఉన్నప్పటికీ ఈ రైలులో సీట్లు దొరకాలంటే 4 నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాలి. కానీ ఇందులో కోటా తక్కువగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు