logo

పురం పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతం

వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

Updated : 01 Jul 2024 05:51 IST

వైకాపా పాలనలో రాయితీల ఎత్తివేత
అధిక విద్యుత్తు ఛార్జీలతో మూతపడిన ఐరన్, ఫార్మ కంపెనీలు 

అధిక విద్యుత్తు ఛార్జీల భారంతో మూతపడిన మనస్వి ఫార్మ కంపెనీ

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: వాణిజ్య కేంద్రంగా పేరొందిన హిందూపురంలో కర్ణాటక సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం, కొటిపి పారిశ్రామికవాడల అభివృద్ధికి గత ఐదేళ్లలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దాదాపు ఐదు దఫాలు విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో ఈ భారం భరించలేక మెగా, పూర్వా స్టీల్స్, వేదిక్, ఇస్పాత్‌ ఐరన్‌ పరిశ్రమలు, మనస్వి ఫార్మ, రెడ్డి ల్యాబ్స్, రహుల్‌ బేరియం పరిశ్రమలు మూతపడ్డాయి. హిందూపురం ప్రాంతంలో గతంలో సూపర్‌ స్పిన్నింగ్‌ మిల్లులు ఉండటంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించిన నాటి శాసనసభ్యుడు ఎన్టీ రామారావు 1983లో వెయ్యి ఎకరాల్లో తూముకుంట పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వంద కిమీ దూరంలో ఉండటం, అవసరమైన అన్ని వసతులు అప్పటి ప్రభుత్వం కల్పించడంతో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తర్వాత 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో తూముకుంట పారిశ్రామికవాడ సమీపంలోని గోళ్లాపురం ప్రాంతంలో వెయ్యి ఎకరాల భూమి సేకరించటంతో ఇక్కడ కెమికల్, ఫార్మ, ఇతర కంపెనీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పారిశ్రామికవాడల్లో 185 చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి వల్ల స్థానికంగా, ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులు, ఇతరులు 20 వేలమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గత తెలుగుదేశం పాలనలో ఈ పారిశ్రామిక వాడను మరింత అభివృద్ధి చేసేందుకు కొటిపి వద్ద 800 ఎకరాల భూమిని సేకరించినా తర్వాత జరిగిన ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పరిశ్రమల ఏర్పాటు గురించి ఇసుమంత కూడా పట్టించుకోకపోవటంతో ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు.

తూముకుంట పారిశ్రామికవాడలో అభివృద్ధికి నోచుకోని అంతర్గత రహదారులు

ఐదేళ్లలో ఒక్క అడుగూ పడలేదు..

తెదేపా పాలనలో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, బీసీలకు 20, ఓసీలకు 15 శాతం రాయితీలు అందించడంతో ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఈ రాయితీలకు మంగళం పాడటంతో పరిశ్రమల ఏర్పాటుకు ఒక్కరూ ముందుకు రాలేదు. పైగా విద్యుత్తు ఛార్జీలు అధికంగా పెంచడంతో ఉన్న పరిశ్రమలే నష్టాల బారినపడి మూతపడ్డాయి. పారిశ్రామిక వాడలో గత ఐదేళ్లలో ఒకే ఒక సీసీ రహదారి ఏర్పాటు చేశారు తప్ప ఇతర అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు.

కూటమి ప్రభుత్వంపై ఆశలు

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఔత్సాహికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాయితీలు కల్పించి తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఆశపడుతున్నారు. తన తండ్రి పాలనలో ఏర్పాటైన పారిశ్రామికవాడను మరింత అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రణాళిక రూపొందించుకొన్నారు. తూముకుంట నుంచి సోమందేపల్లి వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా మార్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని