logo

ఎగవేత పద్దుగా సంతల ఆదాయం

కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది.

Published : 01 Jul 2024 04:26 IST

మూడేళ్ల బకాయిలు రూ.30.55 లక్షలు

కొత్తచెరువులో వారపు సంత

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువు మేజరు పంచాయతీకి జమ కావాల్సిన వేలం ఆదాయం కొండలా పేరుకుపోయి ఎగవేత పద్దుగా మారుతుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగిన నాలుగురోడ్ల కూడలి కావడంతో వారపు, దిన సంతలు, బస్టాండు మార్కెట్లలో సుంకం వసూలుకు ఏటా పోటీ తీవ్రంగా ఉంటుంది. పంచాయతీ పరిధిలోని సంతలకు బహిరంగ వేలం నిర్వహించడం సాధారణం. సర్పంచి, అధికారుల సమక్షంలో జరిగిన వేలాలు డిపాజిట్లు, హెచ్చుపాట రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అయితే వేలంలో పాల్గొనడానికి గుత్తేదారులు చెల్లిస్తున్న డిపాజిట్లు మాత్రమే ఖాతాకు చేరుతున్నాయి. వేలం తరువాత రెండు రోజుల్లో మిగిలిన మొత్తాలు చెల్లించాలని, లేదంటే మళ్లీ వేలం నిర్వహిస్తామని నోటీసుల్లో పేర్కొంటున్నా పాలకుల స్వార్థం కారణంగా అమలుకు నోచుకోవడం లేదు. ఇది గుత్తేదారులకు వరంగా మారింది. కార్యదర్శులు నామమాత్రంగా ఒకటి రెండుసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఏడాది గడువు ముగియడంతో గుత్తేదారులు ఇదే అవకాశమని ఎగవేతకు పాల్పడుతుండటంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. 2021-22లో వారపు సంతకు రూ.2,06,000 బకాయి పడినా అదే గుత్తేదారు 2022-23 బస్టాండు వేలంలో పాల్గొని మళ్లీ రూ.5,07,000 బకాయి పడటం కార్యదర్శి లోపాయికారి ఒప్పందానికి నిదర్శనం. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా కనీసం పర్యవేక్షించి చర్యలు చేపట్టకపోవడం అధికారుల్లో చిత్తశుద్ధి లోపించిందనడానికి నిదర్శనగా నిలుస్తోంది.

వసూళ్లలో నిర్లక్ష్యం

2021-22లో వారపు సంత బకాయి రూ.2,06,000, దిన సంత రూ.21,000, బస్టాండు రూ.61,000, 2022-23లో వారపు సంత బకాయి రూ.2,76,000, బస్టాండు రూ.5,07,000, 2023-24లో వారపుసంత రూ.8,35,000, దిన సంత రూ.4,78,000, బస్టాండు రూ.6,71,000 బకాయి పడ్డారు. మూడేళ్లలో మూడు మార్కెట్ల నుంచి వేలంలో రూ.51.83 లక్షల ఆదాయం లభించింది. డిపాజిటు రూపంలో రూ.21.28 లక్షలు పంచాయతీ ఖాతా వేలం రోజే జమచేయగా రూ.30.55 లక్షలు నేటికీ వసూలు కాకపోవడం కార్యదర్శి నిర్లక్ష్యానికి నిదర్శనగా నిలుస్తోంది.

డిపాజిట్లు స్వాహా చేస్తున్నా..

2023-24లో వారపు సంతకు రూ.6 లక్షలు డిపాజిట్‌ చెల్లించి వేలంలో రూ.14.35 లక్షలకు పాడుకున్నారు. అలాగే దిన సంతకు రూ.3 లక్షలు చెల్లించి రూ.4.78 లక్షలు, బస్టాండుకు రూ.3 లక్షలు చెల్లించి రూ.6.71 లక్షలకు వేలం పాడారు. అయితే దిన సంత, బస్టాండ్‌ డిపాజిటు మొత్తాలను కార్యదర్శి స్వాహా చేయడంతో వారపు సంత డిపాజిటు మాత్రమే పంచాయతీ ఖాతాకు జమ చేశారు.

ఇళ్లకు వెళ్లి వసూలు చేస్తాం

మూడేళ్ల నుంచి మార్కెట్ల వేలం మొత్తాలు బకాయి పడ్డాయి. మూడు మార్కెట్ల బకాయిలు రూ.30.55 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ప్రతినెలా పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలకు నిధులు అవసరం. 2023-24 బకాయిల వసూలుకు మూడో నోటీసు ఇచ్చాం. బకాయిపడిన గుత్తేదారుల ఇళ్ల దగ్గరకు సిబ్బందితో వెళ్లి వసూలు చేయాలని నిర్ణయించాం.    

సురేంద్రనాథరెడ్డి, ఇన్‌ఛార్జి కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని