logo

మాట నిలబెట్టుకొన్న సీఎం చంద్రబాబు

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు.

Published : 01 Jul 2024 04:24 IST

నేడు ఇంటింటికీ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

కొల్లకుంట వడ్డె అంజినప్ప, తెదేపా జిల్లా అధ్యక్షుడు

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకొని సోమవారం పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందిస్తారని తెదేపా జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట వడ్డె అంజినప్ప అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భరోసా కింద ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్, ఈ నెల రూ.4వేలు కలిపి రూ.7వేలు లబ్ధిదారులకు అందిస్తారన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరదాలు కట్టుకొని ప్రజలకు కనిపించకుండా పర్యటనటు చేశారని, నేడు సీఎం చంద్రబాబునాయుడు ప్రజలవద్దకే నేరుగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరిస్తున్నారన్నారు. యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తండ్రి బాటలో నడుస్తూ ప్రజాదర్బార్‌ చేపడుతున్నారని, ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీన్ని బట్టి చూస్తే ఐదేళ్లు వైకాపా ప్రభుత్వ పాలనలో పజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అర్థమవుతోందన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం నుంచి కొనసాగే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వెంట ఇంటింటికీ అబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.


మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పర్యటన నేడు

ధర్మవరం న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ సోమవారం ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 9.30 గంటలకు బత్తలపల్లి మండలం వేల్పుమడుగు, 10 గంటలకు ధర్మవరం మండలం నాగలూరు గ్రామాల్లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే ఉదయం 10.30 గంటలకు ధర్మవరం పట్టణంలోని 35వ వార్డు లక్ష్మీనగర్‌లో, 10.45 గంటలకు 36వ వార్డు కొత్తపేటలో, 11.15కు 6వ వార్డు శివానగర్‌లో, 11.30కు శంకరాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. శివానగర్‌ నాగులకట్ట వద్ద చేనేత కార్మికుల సమస్యలపై ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శారదానగర్‌లోని మంత్రి కార్యాలయానికి చేరుకుంటారని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని