logo

ఎండీయూలతోనే సరకుల పంపిణీ

ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు.

Published : 01 Jul 2024 04:01 IST

ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం రావాలంటే మరో నెల ఆగాల్సిందే
గత ప్రభుత్వంలో అక్రమాలపైనా దృష్టి  
అర్హులైన కార్డుదారులందరికీ అందేలా చర్యలు

ఎండీయూ వాహనం వద్ద సరుకులు తీసుకుంటున్న కార్డుదారులు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే చౌకధరల దుకాణాలకు డీలర్లుగా కొనసాగడం ఆనవాయితీ. తాజాగా తెదేపా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే వైకాపా డీలర్లను తొలగించి, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వాలని కోరుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం సరకులు పంపిణీకి ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. వాటి ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీ కొనసాగుతోంది. పాత డీలర్లను పూర్తిగా తొలగించి, ఎండీయూ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించాలనే ఆలోచనలో తెదేపా ప్రభుత్వం ఉంది. ఈ ప్రక్రియంతా పూర్తి కావాలంటే మరో నెల సమయం పడుతుంది. అయితే ఈ నెల సరకులను ఎండీయూ వాహనాల ద్వారానే కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు ఆదేశాలు అందాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 767 వాహనాలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు సరకులు వాహనాల ద్వారా పంచుతున్నారు. వారికి నెలానెలా ఒక్కో వాహనానికి రూ.21 వేలు ప్రభుత్వమే చెల్లించేది. అందులో ఒక్కో వాహనానికి నెలకు రూ.3 వేలు చొప్పున బ్యాంకులకు కంతులను (ఈఎంఐ) ప్రభుత్వమే చెల్లించి, మిగిలిన రూ.18 వేలను ఎండీయూ ఆపరేటర్లకు వేతనం రూపంలో చెల్లిస్తూ వచ్చింది. వాహనాలకు రెండేళ్ల గడువు ఉంది. వాటిని వ్యవసాయశాఖలో రైతు సేవా కేంద్రాలకు గానీ, వైద్యశాఖలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఉపయోగించే యోచన ఉంది. దీనిపై నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు వెలువరించాల్సి ఉంది.

సరఫరా అస్తవ్యస్తం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,012 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. మొత్తం 12,08,293 కార్డులు ఉన్నాయి. వీరికి నెలానెలా  30 వేల మెట్రిక్‌ టన్నుల సరకులు పంపిణీ చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాలు వచ్చినా అంతా డీలర్ల కనుసన్నల్లో పంపిణీ కొనసాగింది. తూకాల్లో డీలర్లు దోచేశారు. తాజాగా ప్రభుత్వం మారింది. తెదేపా నాయకులు, కార్యకర్తలు మాకే పంపిణీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. చాలాచోట్ల మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. మరికొన్ని చోట్ల వైకాపా నాయకులు పాత డీలర్లకే సరకులు సరఫరా చేశారు. కొన్నిచోట్ల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎండీయూ వాహనాలతో సరకులు పంపిణీ చేయనున్నారు.

ఈ-పాస్, వేయింగ్‌ స్కేళ్లు స్వాధీనం

గత ప్రభుత్వ హయాంలో డీలర్లు, ఎండీయూ వాహనదారులు సరకులు పంపిణీ చేశారు. ఈ-పాస్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ స్కేళ్లు వాళ్ల వద్దనే ఉన్నాయి. అవన్నీ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ-పాస్‌ ద్వారా ఏఏ వాహనం ద్వారా ఏఏ సరకులు ఎంతెంత పంపిణీ చేశారు. భౌతిక నిల్వలు ఎన్ని ఉన్నాయి. గోదాముల్లో బఫర్‌ సరకుల నిల్వలు, తేడా ఏమైనా ఉన్నాయా? అనేవి పరిశీలించాల్సి ఉందని, ఒకవేళ ఎక్కడైనా అక్రమాలు జరిగి ఉంటే ఆ డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అర్హులందరికీ సరకులు

గిరిజన ప్రాంతాల్లో మాత్రమే చౌకధరల దుకాణాల ద్వారా సరకులు పంపిణీ ఉంటుంది. మన జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఈ నెల మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారానే కార్డుదారులకు సరకులు పంపిణీ చేయాలని రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం అందిస్తాం.  పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. అర్హులైన కార్డుదారులందరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

శోభారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి (అనంతపురం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు