logo

లెక్కలో తేడా వస్తే.. అనర్హత వేటే

సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్‌ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే అన్నారు.

Published : 01 Jul 2024 03:59 IST

3 లోగా ఎన్నికల వ్యయాల నివేదికలను సమర్పించాలి
వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ వెల్లడి

మాట్లాడుతున్న పార్లమెంటు వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే, పక్కన కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యయాలకు సంబంధించిన తుది అకౌంట్స్‌ను సమర్పించాలని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు విలాస్‌ వి.షిండే అన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అకౌంట్స్‌ రీకన్సలేషన్‌ మీటింగ్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలసి నిర్వహించారు.  రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ఐఆర్‌ఎస్‌ అధికారి నితిన్‌ అగర్వాల్, అనంతపురం అర్బన్, రాప్తాడు, శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులు రాందాస్‌ టి.కాలే, జిల్లా సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌లు హాజరయ్యారు.

  • విలాస్‌ వి.షిండే మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి నివేదికలను, రిజిస్టర్లను, అకౌంట్స్‌ పుస్తకాలను  డీఈఎంసీకి జూలై 3లోగా అందజేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ నియమ, నిబంధనలను అనుసరించాలన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు నితిన్‌ అగర్వాల్, రాందాస్‌ టి.కాలే మాట్లాడుతూ.. పోటీ చేసిన అభ్యర్థుల ఏవైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
  • అనంతరం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన 30 రోజుల్లోపు అభ్యర్థుల వ్యయాల వివరాలు పూర్తికావాల్సి ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులు వివరాలను డీఈఎంసీకి అందజేయాలన్నారు. జిల్లా నుంచి ఎన్నికల కమిషన్‌కు జులై 11లోపు పంపాల్సి ఉందన్నారు. పరిమితికి మించి ఖర్చు చేసినా, లెక్కలను సరైన సమయంలో చూపకపోయినా అభ్యర్థులపై అనర్హత వేటు పడుతుందన్నారు. పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్‌ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల తేదీ వరకు ఖర్చు చేసిన వివరాలను, షెడ్యూల్‌ 1 నుంచి 11 వరకు అన్ని వివరాలు, బిల్లులు, ఓచర్లు, అఫిడవిట్స్, బ్యాంకు పుస్తకాలు, ఏబీసీ రిజిస్టర్లు సరి చూసుకోవాలన్నారు. వీటన్నింటినీ అభ్యర్థి సంతకంతో జులై 3లోగా అందజేయాలన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని