logo

పీఏబీఆర్‌లో ప్రమాద ఘంటికలు

ఉమ్మడి జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్‌లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం తగ్గిపోయింది.

Published : 29 Jun 2024 04:36 IST

 ఉమ్మడి జిల్లాకు నీటిసరఫరాపై నీలినీడలు
 వైకాపా ప్రభుత్వ వైఫల్యమే కారణం

అడుగంటిన పీఏబీఆర్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్‌లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం తగ్గిపోయింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాకు నీటి సరఫరాపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. పీఏబీఆర్‌ నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు. ఆనకట్ట భద్రత నేపథ్యంలో 5 టీఎంసీల వరకు నిల్వ ఉంచుతూ వస్తున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా 2 టీఎంసీలకు మించి తుంగభద్ర జలాలు రాలేదు. ఇక్కడి నుంచి శ్రీరామరెడ్డి, సత్యసాయి, అనంత నగరపాలక సంస్థల నీటి పథకాలతో పాటు కూడేరు, ఉరవకొండ పథకాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా ఉమ్మడి అనంత జిల్లాలో సింహ భాగం మున్సిపాలిటీలకు, గ్రామాలకు నీరు అందుతున్నాయి.

నాటి మంత్రి నిర్వాకం..

గతేడాది తీవ్ర వర్షాభావం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి పీఏబీఆర్‌కు ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ఈ క్రమంలో జీడిపల్లి జలాశయం నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. అలా చేసి ఉంటే నీరు పుష్కలంగా ఉండేవి. కాని కృష్ణా జలాలను అప్పటి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రాంతానికి తరలించారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా వైకాపా ప్రజా ప్రతినిధులు కనీసం నోరెత్తలేదు. పీఏబీఆర్‌లో నీటి నిల్వ తగ్గుతున్నా తమకేమీ తెలియదన్నట్లు ఉండిపోయారు. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడింది. అయినా ప్రజాప్రతినిధులు నీటి అవసరాన్ని గుర్తించకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయనకు జపం చేస్తూ కాలం గడిపారు.

ప్రస్తుతం 0.695 టీఎంసీలు

జలాశయంలో ప్రస్తుతం 0.695 టీఎంసీ మాత్రమే నిల్వ ఉన్నాయి. వాటిలో 0.361 టీఎంసీ వరకు వినియోగించడానికి ఆస్కారం ఉంది. మిగతా 0.334 టీఎంసీ డెడ్‌ స్టోరేజీ కింద ఉండిపోనుంది. ప్రస్తుతం తాగునీటి పథకాలకు 55 క్యూసెక్కులు, విద్యుత్తుకు 15 క్యూసెక్కులు వినియోగిస్తుండగా 25 క్యూసెక్కుల వరకు నీరు ఆవిరి అవుతున్నాయి. దానికితోడు జలాశయం గట్టు కింద భాగంలో లీకేజీల కారణంగా నీరు వృథా అవుతోంది. పడమటి గాలులు అధికంగా వీస్తుండటంతో నీటి ఆవిరి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో 30-40 రోజుల్లో డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోనుంది.

నీటి పథకాలపై ప్రభావం

పీఏబీఆర్‌లో నీటి నిల్వ గణనీయంగా తగ్గుతుండటంతో తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అనంత నగరపాలక సంస్థకు చెందిన ఇంటెక్‌వెల్‌ వద్ద నీటి నిల్వ బాగా తగ్గింది. అక్కడి మోటార్లకు నీరు అందడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు అదనంగా మరిన్ని పైపులను దించి నీటిని తోడుకుంటున్నారు. నిల్వ తగ్గే కొద్ది శ్రీరామరెడ్డి, సత్యసాయి, ఉరవకొండ, కూడేరు పథకాలకు నీరు అందడం భారం కానుంది.

తుంగభద్ర నిండితేనే..

పీఏబీఆర్‌కు నీరు సరఫరా కావాలంటే కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నిండాలి. అప్పుడు హెచ్చెల్సీ ద్వారా తుంగభద్ర జలాలు ఈ జలాశయానికి తరలిస్తారు. ప్రస్తుతం తుంగభద్రలో నీటి నిల్వ ఆశాజనకంగా లేదు. అక్కడి నుంచి నీరు రావడం కష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులు అనుకూలించి, అంతా మంచి జరిగితే ఆగస్టు రెండో వారం నీరు విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని