logo

రూ.2 కోట్లు దారి మళ్లించి.. కాలువలను విస్మరించి

సమగ్ర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లను కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది.

Published : 29 Jun 2024 04:33 IST

ఆధ్యాత్మిక కేంద్రం కసాపురంలో మురుగు సమస్య
గత వైకాపా ప్రభుత్వ పాపమిది

కసాపురంలో అధ్వానంగా మురుగు కాలువ

గుంతకల్లు, న్యూస్‌టుడే : సమగ్ర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లను కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. ఫలితంగా కాలువల నిర్మాణం జరగలేదు. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేలాదిమంది భక్తులతోపాటు స్థానికులకు  కసాపురంలో అవస్థలు తప్పడం లేదు. రోడ్డుమీద ప్రవహించే మురుగును దాటుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

కసాపురంలో దాదాపు 1500 ఇళ్లతో పాటు 2500 వరకు జనాభా ఉంది. రోజుకు 2 లక్షల లీటర్ల మురుగు వస్తుంది. చాలా వరకు మట్టి కాలువలు కావడంతో వాటిని శుభ్రం చేయడానికి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ తెదేపా ప్రభుత్వం కొలువుదీరడంతో సమగ్ర మురుగు కాలువ వ్యవస్థ అంశం తెరపైకి వచ్చింది.

గుంతకల్లు - కర్నూలు రోడ్డు పక్కన ప్రమాదకరంగా కాలువ గుంత

భూమి పూజకు పరిమితమైన పనులు

కసాపురంలోని మురుగు సులభంగా బయటకు వెళ్లడానికి అప్పటి తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పనులను ప్రారంభించడానికి మూడు సంవత్సరాల కిందట అప్పటి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభం కాలేదు. కేటాయించిన నిధులను ప్రభుత్వం దారి మళ్లించడంతో పనులు అమలుకు నోచుకోలేదు. కసాపురం ఎగువ భాగంలో ఉండగా నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం లోతట్టులో ఉంది. ఫలితంగా మురుగంతా ఆలయానికి చెందిన స్థలంలోనే కాకుండా ఆలయానికి ఆనుకుని వెళుతోంది. కాలువలు సరిగా లేకపోవడంతో అందులో పడి గ్రామానికి చెందిన బాలుడు నాలుగేళ్ల కిందట మృతిచెందాడు. కాలువ గుంతకల్లు - కర్నూలు రోడ్డు మధ్య గుండా వెళ్తుంది. రోడ్డుపక్కన ఉన్న కాలువ ప్రమాదాలకు నిలయంగా మారింది. కొన్ని సమయాల్లో వాహనాలు కాలువలో ఇరుక్కుపోతున్నాయి.

వర్షం వస్తే నీరు, మురుగు రోడ్లపై జోరుగా ప్రవహిస్తుంది. మురుగు పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గ్రామస్థులతో పాటు ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

కసాపురంలో మురుగు కాలువలను నిర్మించడానికి గతంలో ఇంజినీర్లు సర్వే చేసి పాయింట్లను గుర్తించారు. లోతైన కాలువలను నిర్మించాలనే అంశంపై ప్రణాళిక రూపొందించారు. రూ. 2 కోట్లతో చేపట్టే మురుగు కాలువల పనులు ప్రారంభం కాలేదు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభించే విధంగా చూడాలని కోరుతాం.

 రామలింగప్ప,  పంచాయతీ కార్యదర్శి, కసాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని