logo

పామిడి.. వస్త్ర రంగం ఢీలాపడి

పామిడి వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా జిల్లాలో ఎంతో పేరుగడించింది. ఇక్కడ టైక్స్‌టైల్స్, రెడీమేడ్, కట్ పీˆస్‌ క్లాత్‌ దుకాణాలు  దాదాపు 1000 ఉన్నాయి.

Published : 29 Jun 2024 04:29 IST

వ్యాపారం లేక వెల వెలబోతున్న దుకాణం

పామిడి, న్యూస్‌టుడే : పామిడి వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా జిల్లాలో ఎంతో పేరుగడించింది. ఇక్కడ టైక్స్‌టైల్స్, రెడీమేడ్, కట్ పీˆస్‌ క్లాత్‌ దుకాణాలు  దాదాపు 1000 ఉన్నాయి. వీటిలో నైటీలు, చీరలు, ప్యాంట్లు, షర్టులు, ఇతర దుస్తులు అమ్మే దుకాణాలు ఉన్నాయి. వీటిపై కొన్ని వందల దర్జీ కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గతంతో ఒక వెలుగు వెలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. వైకాపా ప్రభుత్వంలో ప్రోత్సాహం కరవై వస్త్రవ్యాపార రంగం నిలువునా మునిగిపోయింది.

గతంలో లాభదాయకం

గతంలో వస్త్ర వ్యాపారం లాభదాయకంగా సాగింది. వ్యాపారానికి అనువైన ముడి సరకులు తక్కువ ధరకు అందుబాటులో ఉండేవి. రెడీమేడ్‌ దుస్తులు తయారీకి గిరాకీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలతో పాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరకును తరలించడంతో భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది. రేడీమేడ్‌ దుస్తుల తయారీ చాలా కుటుంబాలకు జీవనోపాధిగా మారింది. పామిడిలో ఎక్కడ చూసినా దర్జీ పనులు చేసే వారు ఎక్కువగా కనిపిస్తారు.

ప్రస్తుతం దయనీయం

కరోనా సమయంలో వస్త్ర వ్యాపారం పడిపోయింది. నెలల తరబడి వ్యాపారులు దుకాణాలను మూసివేయడంతో సరకు అమ్ముడుపోక నష్టాలు వాటిల్లి వందల దుకాణాలు మూతపడ్డాయి. సరకు నిల్వలు పేరుకుపోవడంతో పెట్టుబడి రాక తెచ్చిన పెట్టుబడికి వడ్డీలు, దుకాణాల బాడుగలు, పనిచేసే వారికి వేతనాలు చెల్లించలేక వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు ఇతర ప్రాంతాల వ్యాపారులు దుస్తులకు డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టడంతో నష్టాలు చవిచూశారు. వస్తు సేవల పన్ను వ్యాపారులను కలవరం పెడుతోంది.

ముడిసరకు ధర తగ్గించి ఆదుకోవాలి

వస్త్రాలకు సంబంధించి ముడిసరకు ధరలు తగ్గించాలి. అప్పుడే కుట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారికి, చిరు వ్యాపారులకు చేతి నిండా పని దొరకుతుంది. వ్యాపారులకు పెనుభారంగా మారిన జీఎస్టీని రద్దు చేస్తే వస్త్ర వ్యాపార రంగం లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది.

 శ్రీనివాసరావు, క్లాత్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, పామిడి

వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు

ఒకప్పుడు పదిమందికి పని ఇచ్చే వ్యక్తిని నేడు కూలీగా జీవనం సాగిస్తున్నా. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం వ్యాపారులను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి చిరు వ్యాపారులను ప్రోత్సహించే దిశగా తక్కువ వడ్డీతో రుణాలు, సబ్బిడీ రుణాలు, పరికరాలను ఇవ్వాలి.

 మహేంద్రకర్‌ రఘునాథ్‌రావు, చిరు వ్యాపారి, పామిడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని