logo

అధికార బలం.. అవినీతికి ఊతం

గత వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన అవినీతి కార్యాకలాపాల్లో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వామ్యం ఉంటడమే.

Published : 29 Jun 2024 04:21 IST

జగనన్న ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు
రూ.1.20 కోట్లు నొక్కేసిన ఏఈ  
వైకాపా ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి

పుట్టపర్తి, కొత్తచెరువు, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన అవినీతి కార్యాకలాపాల్లో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వామ్యం ఉంటడమే. ఒక మండలంలో అవినీతికి పాల్పడటం.. మరో మండలానికి బదిలీ కావడం.. ఇలా ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా ఏఈ వ్యవహరించాడు. జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించకుండానే బిల్లులు స్వాహా అయ్యాయి. అవినీతి ఆరోపణలు బహిర్గతమై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా విచారణ చేపట్టిన దాఖలాలు లేవు. వైకాపా నాయకుల అండదండలతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. పెనుకొండ, నల్లమాడ, కొత్తచెరువు, ఓడీసీ మండలాల్లో హరిప్రసాద్‌రెడ్డి స్వాహాపర్వం యథేచ్ఛగా సాగింది. కొత్తచెరువు మండలంలో 6వేల బస్తాల సిమెంటు స్వాహా చేయడంతోపాటు లబ్ధిదారులకు అందాల్సిన దాదాపు వెయ్యి టన్నుల ఇసుక కూపన్లను పక్కదారి పట్టించిన వైనంపై ‘ఇవ్వకున్నా ఇచ్చినట్లు...అంతా కనికట్టు’ శీర్షికన 2022, మేలో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. అప్పట్లోనే అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చినా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఓడీసీ మండలంలో వైకాపా నాయకులు గృహాలు నిర్మించకుండానే బిల్లులు వారి ఖాతాలకు జమ చేసుకుని స్వాహా చేసినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాదాపు రూ.1.20 కోట్లు అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

పునాది వేసి.. ఇటుకలు ఇచ్చారు

నలుగురు పిల్లలు ఉన్నారు. తాత్కాలిక గుడారంలో తలదాచుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాలుగేళ్ల క్రితం అప్పుడున్న ఏఈ ఇల్లు కట్టిస్తానని రూ.60 వేలు తీసుకున్నారు. పునాది వేసి సిమెంటు ఇటుకలు ఇచ్చారు. మూడేళ్లుగా ఏఈ కనిపించలేదు. ఎవరిని అడగాలో తెలియలేదు.

పూల వెంకటరమణమ్మ, కొత్తచెరువు

విధుల నుంచి తొలగించాం

గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్‌రెడ్డిని విధుల నుంచి తొలగించాం. ఇటీవల ఓడీసీ మండలంలో జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణంలో రూ.1.20 కోట్లు అవినీతికి పాల్పడినట్లు గుర్తించాం. కలెక్టర్‌ అరుణ్‌బాబుకు నివేదిక అందజేశాం. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

వెంకటనారాయణ, పీడీ, జిల్లా గృహనిర్మాణ శాఖ

రూ.95 వేలు ఇచ్చా

అనారోగ్యంతో ఉన్న భర్త, ఆరుగురు పిల్లల పోషణ భారం నాదే. ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అదనంగా ఇస్తే ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.1.20 లక్షలతోపాటు అప్పుచేసి రూ.95 వేలు ఏఈకి ఇచ్చాను. పైకప్పు అయ్యాక ఆచూకీ లేకుండా పోయారు. మిగిలిన ఇంటి పని పూర్తి చేయలేదు. 

 నరసమ్మ, కూలీ, కొత్తచెరువు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని