logo

పంచాయతీల్లో స్వచ్ఛత ఏదీ?

పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాన్న లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ కింద వాహనాలను పంచాయతీలకు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవడంతో స్వచ్ఛ వాహనాలు మూలకు చేరాయి.

Published : 29 Jun 2024 04:19 IST

కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ సున్నగుట్టతండా సమీపాన రహదారిపై చెత్తాచెదారం

కదిరి, పుట్టపర్తి, న్యూస్‌టుడే: పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాన్న లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ కింద వాహనాలను పంచాయతీలకు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవడంతో స్వచ్ఛ వాహనాలు మూలకు చేరాయి. దీంతో చాలా చోట్ల చెత్తసేకరణ ప్రక్రియ ఆగిపోయింది. వీధులు అపరిశుభ్రతగా మారి, రహదారులపైన చెత్తదిబ్బల దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లు ఖర్చుచేసి పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులకు స్వచ్ఛభారత్‌ కింద వాహనాలు ఇచ్చారు. నిర్వహణతోపాటు కార్మికులకు వేతనాలు ఇవ్వక మూలనపడ్డాయి. కనీసం మరమ్మతులు చేయించకపోవడంతో వాహనాలు తుప్పుపట్టాయి. కొన్ని విడిభాగాలు అపహరణకు గురయ్యాయి.  జిల్లాలో ఆరు ఆటోలు, 25 ట్రాక్టర్లు, 310 రిక్షాలు మరమ్మతులకు గురికావడంతో ఆపేశారు. వీటికితోడు వాహనాలను నడిపేందుకు 15మంది డ్రైవర్ల కొరత ఉంది.

తలుపుల: మేజర్‌ పంచాయతీ తలుపులలో రెండు ట్రాక్టర్లు, ఆటో, పది రిక్షాలు ఉన్నాయి. వాటిలో ఐదు ఆటోలను మూలనపెట్టారు. దీంతో అవి తుప్పుపడుతున్నాయి. మురుగు కాల్వల్లో పూడిక తొలగించే మినీ జేసీబీ నిరుపయోగంగా మారింది. రూ.లక్షల విలువైన జేసీబీని ఆరుబయట పడేశారు. ఫలితంగా పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది.

కదిరి గ్రామీణం: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి, పట్నంలో ఆటోలు మరమ్మతులకు వచ్చాయి. కుమ్మవాండ్లపల్లిలో ఆటో బ్యాటరీ అపహరణకు గురైంది. మొటుకుపల్లి, కాళసముద్రం  డ్రైవర్లు లేక నిలిపేశారు. మండలంలోని 36 రిక్షాల్లో సగానికి పైగా మూలన పడేశారు. కొత్తగా మంజూరైన వాహనాలను వినియోగించకుండానే తుప్పుపడుతున్నాయి. దీంతో రోడ్లపై చెత్త, వీధుల్లోకి మురుగు చేరుతోంది.

వినియోగంలోకి తెస్తాం...

పలు పంచాయతీల్లో చెత్తసేకరణ వాహనాల్లో కొన్ని పని చేయడంలేదు. కొన్నింటికి డ్రైవర్ల కొరత ఉంది. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

విజయకుమార్, జిల్లా పంచాయతీ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని