logo

గత పాలకుల పాపం.. పురం పురోగతికి శాపం

ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీని సర్వ నాశనం చేసింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా రద్దు చేసి, పురపాలికపై అదనపు భారం మోపింది.

Published : 29 Jun 2024 04:16 IST

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీని సర్వ నాశనం చేసింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా రద్దు చేసి, పురపాలికపై అదనపు భారం మోపింది. హిందూపురం వాసుల 50 ఏళ్ల కల అయిన నూతన మార్కెట్‌ నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, ముఖ్యమైన రహదారి విస్తరణ, అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెదేపా ప్రభుత్వం అంకురార్పణ చేసి ముందుకు తీసుకెళ్తే వాటిని అస్తవస్త్యం చేసి పట్టణాభివృద్ధిని అటకెక్కించారు. ఈ పాపాలను సరి దిద్దడం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పాలకులకు పెద్ద సవాలుగా మారింది. నాలుగు నెలల తర్వాత శనివారం కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.

 పట్టణంలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక చొరవ తీసుకొని తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.66 కోట్లతో రహదారులు, కాలువల నిర్మాణం, ఉద్యానవనాల ఏర్పాటు తదితర పనులు జరిగేలా చూశారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్న దశలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రద్దు చేసింది. ఐదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఇటీవలే మున్సిపల్‌ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.83 కోట్లు అవసరమని నిర్ధారించారు. అంటే పనులు రద్దు చేయడంతో అదనంగా రూ.25 కోట్లు అవసరం అవుతోంది.

రైల్వే రోడ్డు విస్తరణ జరిగేదెలా..

పట్టణంలో రైల్వే రోడ్‌ విస్తరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తెదేపా హయాంలో తొలగించారు. విస్తరణ పనులు చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. రైల్వే రోడ్‌ను విస్తరిస్తామని ముందుకొచ్చిన వైకాపా ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది.

రూ.30 కోట్లతో నిర్మించిన మార్కెట్‌ వృథా..

పట్టణంలో రూ.30 కోట్లతో తెదేపా హయాంలో నూతన మార్కెట్‌ను పట్టణ నడిబొడ్డున 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. వేలం పాటలు వేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. అంతే మున్సిపాల్టీకి ఆదాయం చేకూర్చాల్సిన మార్కెట్‌ వైకాపా నాయకులకు కామధేనువుగా మారింది. గదుల కేటాయింపు నుంచి మార్కెట్‌లో చిన్నచిన్న పనులు చేయడం వరకు అన్నింటిలోనూ దండుకొన్నారు.

 ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.192 కోట్లతో నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టును నిర్మించారు. ఈ నీటిని పట్టణంలోని అన్ని ప్రాంతాలకు అందించేందుకు రూ.75 కోట్లతో అంతర్గత పైపులైన్‌ వ్యవస్థ ఏర్పాటు, ట్యాంకుల నిర్మాణం పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వైకాపా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. రూ.100 కోట్లతో పనులు చేస్తామని చెప్పినా, ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని