logo

న్యాక్‌ శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

ప్రస్తుత సమాజంలో యువత ఉపాధి పొందాలంటే సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న న్యాక్‌ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

Published : 29 Jun 2024 04:10 IST

పీడబ్ల్యూ కార్యాలయ ఆవరణలోని గదుల సముదాయం

గుంతకల్లు, గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రస్తుత సమాజంలో యువత ఉపాధి పొందాలంటే సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న న్యాక్‌ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గుంతకల్లులో 2008 నుంచి న్యాక్‌ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలక్ట్రిషియన్, ల్యాండ్‌ సర్వేయర్, ప్లంబర్‌ తదితర విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ప్రైవేట్‌ కంపెనీల్లో వృత్తిపరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏడాది శిక్షణార్థులను రెండు బ్యాచ్‌లుగా విడదీసి 3 నెలలు పాటు శిక్షణ ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. ప్రతి బ్యాచ్‌లో 80 శాతం మందికి ప్రైవేట్‌ కంపెనీల్లో 20 శాతం స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. శిక్షణ పొందిన యువత మెయిల్, శోభ డెవలపర్స్, బీఎస్‌సీపీఎల్, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ వంటి సంస్థల్లో ఉద్యోగులుగా చేరుతున్నారు. న్యాక్‌ నుంచి శిక్షణ పొందిన అభ్యర్థులు వేల సంఖ్యలో కొలువులు సంపాదించి జీవితాల్లో స్థిరపడ్డారు.

శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌

వసతులు మెరుగుపడితే.. ప్రయోజనం

2019 కరోనా తరువాత న్యాక్‌ శిక్షణలో యువతకు భోజనం, వసతి కల్పన అవకాశం లేకుండా పోయింది. కరోనా నుంచి బయటపడి పరిస్థితులు మారడంతో తిరిగి న్యాక్‌ శిక్షణ తరగతులను 2021 నుంచి ప్రారంభించారు. తరగతుల నిర్వహణకు సరిపడా భవనాలు అందుబాటులో లేకపోవడంతో పట్టణంలోని పీడబ్ల్యూ కార్యాలయ ఆవరణలోని గదులను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.

 ఆధునిక భవనాలు సమకూరితే గ్రామీణ, సూదూర ప్రాంతాల నుంచి శిక్షణ కోసం వచ్చే విద్యార్థులకు భోజన సదుపాయంతో పాటు, వసతి కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోవడంలేదని శిక్షణార్థులు వాపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి యువత శిక్షణకు ఉపయోగకరంగా ఉండేలా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగం వచ్చింది

న్యాక్‌లో ఎలక్ట్రికల్‌ విభాగంలో శిక్షణ తీసుకొన్నా. ప్రస్తుతం కర్ణాటకలోని గదగలోని మెయిల్‌ కంపెనీలో ఉద్యోగం పొందా. కంపెనీ నుంచి భోజనం, వసతి సదుపాయం కల్పించారు. ఉపాధి లభించడంతో జీవితం సంతోషంగా సాగుతోంది. నా కుటుంబానికి ఆ ఉద్యోగం ఎంతో ఆసరగా నిలిచింది.

శ్రీయువ కిరణ్, గుంతకల్లు

  కొత్త పాలకులు దృష్టి సారించాలి

ప్రస్తుతం ఉన్న భవనాలను ఆధునీకరిస్తే శిక్షణ పొందడానికి వచ్చిన యువతకు సౌకర్యంగా ఉంటుంది. తరగతి గదుల్లో ఉన్న విలువైన సామగ్రి ఉంచడానికి కేంద్ర చిన్నగా ఉంది. కొత్త ప్రభుత్వం దృష్టి సారిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

సుధాకర్, న్యాక్‌ కేంద్ర బాధ్యుడు, గుంతకల్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని