logo

భూమి కౌలుకు ఇస్తే ఆక్రమించాడు

ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళుతూ తన భూమిని ఓ వైకాపా నాయకుడికి కౌలుకు ఇస్తే ఆక్రమించాడని బాధిత రైతు ఆరోపించారు.

Published : 29 Jun 2024 04:06 IST

వైకాపా నాయకుడిపై బాధిత రైతు ఫిర్యాదు

బెళుగుప్ప, న్యూస్‌టుడే: ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళుతూ తన భూమిని ఓ వైకాపా నాయకుడికి కౌలుకు ఇస్తే ఆక్రమించాడని బాధిత రైతు ఆరోపించారు. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. బెళుగుప్ప మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన కిష్టప్ప సర్వే నంబర్‌ 13-1లో 4.75 ఎకరాల భూమిని నారాయణప్ప అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. బతుకుదెరువుకు కొన్నేళ్ల కిందట పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరుకు వలస వెళ్లారు. అక్కడ గీత కార్మికుడిగా ఉపాధి పొందుతున్నారు. గ్రామంలోని భూమిని వైకాపా నాయకుడు సుధాకర్‌కు కౌలుకు ఇచ్చినట్లు తెలిపారు. అతడు నాలుగేళ్ల నుంచి కౌలు డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. భూమిని తానే సాగు చేయాలని నిర్ణయించుకొని పొలంలోకి వెళ్లిన ప్రతిసారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సదరు వైకాపా నాయకుడు దౌర్జన్యం చేస్తూ, తనను, తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని బాధిత రైతు వాపోయారు. భూ దస్త్రాలు అన్ని తన పేరు మీదే ఉన్నాయని, అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. దీనిపై గత సోమవారం స్పందనలో జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సదరు ఫిర్యాదు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషనుకు వచ్చింది. దీనిపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని