logo

జాగాలపై డేగలు..!

పేదలకు సెంటు భూమి ఇస్తామని ప్రైవేటు భూములను కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఆలస్యమనే వంకతో రెవెన్యూ అధికారుల కమిటీ ధర నిర్ణయించి రైతులకు నచ్చితే విక్రయించాలని అన్నారు. ఇలా వైకాపా నాయకులు ఇష్టారీతిన రేట్లు పెంచి రూ.కోట్లలో జనం సొమ్ము కాజేశారు.

Published : 10 Jul 2024 06:12 IST

నాడు పేదల స్థలాల పేరుతో రూ. 300 కోట్ల దోపిడీ
పంచుకున్న అధికారులు, వైకాపా నాయకులు
బందరు, పెనమలూరు, మైలవరం, గన్నవరంలలో భారీ అక్రమాలు
ఈనాడు, అమరావతి

పేదలకు సెంటు భూమి ఇస్తామని ప్రైవేటు భూములను కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఆలస్యమనే వంకతో రెవెన్యూ అధికారుల కమిటీ ధర నిర్ణయించి రైతులకు నచ్చితే విక్రయించాలని అన్నారు. ఇలా వైకాపా నాయకులు ఇష్టారీతిన రేట్లు పెంచి రూ.కోట్లలో జనం సొమ్ము కాజేశారు. భూసేకరణ చట్టం మేరకు రెండున్నర రెట్లు చెల్లించేవీలుంది. నాడు ఓ ముఖ్య రెవెన్యూ అధికారి ఒకరు ఈ అక్రమంలో చురుగ్గా వ్యవహరించారు.

యా నియోజకవర్గాల్లో తెరముందు దళారులు.. రైతులతో బేరసారాలాడగా.. తెర వెనుక అధికారులు, నేతలు చక్రం తిప్పారు. ఇలా జిల్లామొత్తమ్మీద దోచేసిన సొమ్ము సుమారు రూ. 300 కోట్లు! అధికారులేమో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. తోట్లవల్లూరుకు చెందిన ఓ రైతు వద్ద అధిక మొత్తం కమీషన్‌ డిమాండ్‌ చేసిన అధికారిణి అనిశా వలకు చిక్కిన విషయం విదితమే. ఆనాడు వీరంతా నొక్కేసిన దాదాపు రూ. 300 కోట్లను తిరిగి రాబట్టే అవకాశం ఉందా? అన్న చర్చ నడుస్తోంది. రైతుల నుంచి కమీషన్లు దండుకున్న దళారులను కొన్ని జిల్లాల్లో రైతులు నిలదీస్తున్నారు. ఏకంగా ఓ మాజీ మంత్రి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • గుడివాడ శివారులో జగనన్న కాలనీ కోసమంటూ 77 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎకరాకు రూ. 51 లక్షల చొప్పున రైతులకు చెల్లించినట్టు దస్త్రాల్లో చూపించారు. వాస్తవానికి ఇక్కడ మార్కెట్‌ ధర రూ. 25 లక్షలే. రైతులకేమో రూ. 30 లక్షల చొప్పున చెల్లించి మిగిలింది అధికారపక్ష నాయకులు నొక్కేశారు. ఇలా రూ. 15.40 కోట్ల ప్రజల సొమ్మును మింగేశారు.
  • విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామం పల్లతిప్పలో 50 ఎకరాలను కొన్నారు. మొదట అధికారులు ఎకరా ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించగా.. దళారులు జోక్యం చేసుకుని రూ. 70 లక్షలకు పెంచారు. .
  • బాపులపాడు మండలంలో ఎకరా మార్కెట్‌ ధర రూ. 30 లక్షలు. కానీ.. రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల చొప్పున 20 ఎకరాలను కొనుగోలు చేశారు.
  • పెనమలూరు నియోజకవర్గంలోని వణుకూరులో 5,471 మందికి స్థలాలిచ్చేందుకు 210 ఎకరాలను కొన్నారు. ఎకరా ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించడంతో చాలామంది రైతులు తమ భూములను అమ్మేందుకు ముందుకొచ్చారు. రూ. 5 లక్షలను ఖర్చుల కింద ఇవ్వాలని దళారులు ముందుగానే అనధికార ఒప్పందం కుదుర్చుకున్నారు. అధికారులు మాత్రం వారికి నచ్చినవారి భూములనే తీసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ రూ. 25 లక్షలు. మార్కెట్‌ ధర రూ. 35 లక్షల వరకు ఉంది. అంటే 210 ఎకరాలకు రూ. 73.50 కోట్లు సరిపోతుంది. కానీ రూ. 157.50 కోట్లు చెల్లించారు. ఇందులో ఎకరానికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు అధికారులు, నాయకులు పంచుకున్నారు. దాదాపు రూ. 31.50 కోట్లు వారికి ముట్టింది.
  • పల్లతిప్ప సమీపంలోనే మరో వంద ఎకరాలను కొనేందుకు దళారులు ఎకరానికి రూ. 70 లక్షల చొప్పున ఇప్పిస్తామని రైతులకు హామీ ఇచ్చి బేరాలు కుదిర్చారు.
  • కంకిపాడు మండలంలో 18 ఎకరాల ప్రైవేటు భూమికి ఎకరా రూ. 80 లక్షల చొప్పున చెల్లించారు. ఇక్కడ మార్కెట్‌ ధర గరిష్ఠంగా రూ. 40 లక్షలుగా ఉంది. గంగూరు ఉప్పులూరు మధ్య 30 ఎకరాలను కొనుగోలు చేశారు.
  • మైలవరం నియోజకవర్గంలో ఎకరాకు రూ. 26 లక్షల చొప్పున ఖరీదు చేశారు.
  • బందురు నియోజకవర్గంలో సముద్రానికి కేవలం 500 మీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు.
  • విజయవాడ నగరంలోని పేదలకు వెలగలేరు, కొండపల్లి, వెదురుపావులూరు, కొంపావులూరు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కేటాయించారు.

దారి మళ్లిందంతాప్రజల సొమ్మే..

  • అక్కడ ఎకరా మార్కెట్‌ ధర గరిష్ఠంగా రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలు...
  • కానీ... నాటి వైకాపా ప్రభుత్వం చెల్లించింది రూ. 30 లక్షలు...
  • ఎందుకింత అంటే.. పేదల ఇళ్ల కోసం భూసేకరణ ఆలస్యమవుతోందంటూ వంక చెప్పింది.
  • ఇలా 150 ఎకరాలను కొనుగోలు చేసి... రూ. 45 కోట్లను చెల్లించింది.
  • ఇందులో రూ. 22.50 కోట్లు రైతులకు వెళ్లగా.. మిగిలిందంతా దళారులు మింగేశారు.
  • వారి వెనుక ఉన్నదెవరో కాదు..ఆనాటి ప్రజాప్రతినిధి. బందరు నియోజకవర్గంలోని కరగ్రహారంలో సాగిన కుంభకోణమిది...
  • ఇలా దారి మళ్లిందంతా ప్రజల సొమ్మే.. ఇటు రైతులకు దక్కలేదు.. అటు ప్రభుత్వ పనులకూ ఉపయోగపడలేదు... మరి ఈ సొమ్మును ఇప్పుడు కక్కించగలరా?

ఉమ్మడి జిల్లాలో మంజూరైన పక్కా గృహాలు  1,74,256
జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేసిన భూమి 1,859 ఎకరాలు
వెచ్చించిన సొమ్ము రూ. కోట్లలో 950
ఎకరానికి నేతలు, అధికారులు నొక్కేసింది రూ. లక్షల్లో 1520
ఇలా ఉమ్మడి జిల్లాలో దండుకున్నది రూ . కోట్లలో 300


అంతా రహస్యమే..

బందరులోని కరగ్రహారం లేఔట్‌

ప్రజాప్రయోజన కింద భూసేకరణ చేస్తే... ముందుగా నోటీసివ్వాలి. ప్రజాప్రయోజనం వివరించాలి. అభిప్రాయ సేకరణ జరపాలి. డ్రాఫ్ట్‌నోటిఫికేషన్, డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి. నాటి వైకాపా ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. అంతా రహస్యంగా కానిచ్చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని