logo

గంజాయిపై ఉక్కుపాదం

పెరుగుతున్న గంజాయి వినియోగం, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసు కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు.

Published : 10 Jul 2024 05:52 IST

కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
జోనల్‌ స్థాయిలోనూ 3 బృందాలు

ఈనాడు - అమరావతి: పెరుగుతున్న గంజాయి వినియోగం, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసు కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. బుధవారం దీనికి అంకురార్పణ చేయనున్నారు. దీంతో పాటు జోన్‌ స్థాయిలోనూ ప్రత్యేక బృందాన్ని కూడా నియమించనున్నారు. విద్యాకేంద్రంగా ఎదిగిన విజయవాడ, పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం బాగా పెరిగింది. పోలీసుల కళ్లుగప్పి రవాణా అవుతోంది. ఏజెన్సీ నుంచి నగరానికి పెద్దఎత్తున చేరుతోంది. విద్యార్థులే విక్రేతలుగా మారే వరకు పరిస్థితి వెళ్లింది. ఈ నేపథ్యంలో మత్తుకు యువత చిత్తు కాకుండా కాపాడేందుకు టాస్క్‌ఫోర్స్‌కు పోలీస్‌ కమిషనర్‌ రూపకల్పన చేశారు.

మత్తులో యువత చిత్తు: ఏజెన్సీ నుంచి స్మగ్లర్లు బస్సుల్లో రవాణా చేస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో అయితే తనిఖీలు ఉంటాయని ఈ మార్గంలో ఎక్కువగా బెజవాడ చేరుతోంది. ప్రత్యేకంగా సమాచారం ఉన్న సందర్భాల్లోనే పోలీసులు తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అధిక సందర్భాలలో నిఘా గప్పి వస్తోంది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు పలువురు స్వయంగా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి కొని నగరానికి తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో గంజాయి అమ్ముతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది వీరే కావడం గమనార్హం. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి రెండు నుంచి ఐదు కిలోల వరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై తీసుకువస్తున్నారు. వాటిని తిరిగి చిన్న పొట్లాలుగా చేసి, ఒక్కొక్కటి రూ.100 కు విక్రయిస్తున్నారు. కేజీ రూ.వెయ్యికి కొని.. ఇక్కడ రూ.5 వేల చొప్పున అమ్ముతున్నారు.

ఏసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు: కమిషనరేట్‌ స్థాయిలో ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు, కానిస్టేబుళ్లతో 12 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు అవుతోంది. ఇందులో లా అండ్‌ ఆర్డర్, కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్, సాంకేతిక విభాగాలకు చెందిన వారిని నియమించనున్నారు. ఇందులో సభ్యులు స్థానిక బృందాల సమన్వయంతో రవాణా, సరఫరా మార్గాలపై దృష్టి సారించి, వాటి మూలాల వరకు వెళ్లి కీలక వ్యక్తుల ఆటకట్టించే దానిపై దృష్టి పెట్టనున్నారు. టాస్క్‌ఫోర్స్‌కు తోడ్పాటు అందించేందుకు జోనల్‌ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు ఏర్పాటు అవుతున్నాయి. కమిషనరేట్‌లో తూర్పు, పశ్చిమ, గ్రామీణ జోన్ల పరిధిలో పనిచేసేందుకు మూడు బృందాలు పని చేయనున్నాయి. స్థానికంగా విద్యాసంస్థల వద్ద నిఘా పెట్టడం, సరఫరా, అమ్మకాలపై దృష్టి సారించి నిందితుల గురించి సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేస్తుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని