logo

మనసంతా సేవ.. ఊరంతా వెలుగు..

పుట్టి పెరిగిన ఊరిపై ఆయన చూపిన మమకారం ఆ పల్లెకు వెలునిచ్చింది. ఒకప్పుడు వీధి దీపం వెలుగులో చదివి, డొంక రహదారిపై ఐదు కిలోమీటర్ల నడక సాగించి తండ్రి సూచన మేరకు కష్టపడి చదువుకుని ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన కన్నతల్లి వంటి సొంతూరికి మేలు చేశారు.

Updated : 10 Jul 2024 06:15 IST

విద్యుత్తు ఉప కేంద్రానికి 34 సెంట్ల భూమి విరాళం
మారేడుమాక(కంకిపాడు), కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే

నూతనంగా నిర్మించిన విద్యుత్తు ఉప కేంద్రం

పుట్టి పెరిగిన ఊరిపై ఆయన చూపిన మమకారం ఆ పల్లెకు వెలునిచ్చింది. ఒకప్పుడు వీధి దీపం వెలుగులో చదివి, డొంక రహదారిపై ఐదు కిలోమీటర్ల నడక సాగించి తండ్రి సూచన మేరకు కష్టపడి చదువుకుని ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన కన్నతల్లి వంటి సొంతూరికి మేలు చేశారు. నా కుటుంబం బాగుంది..ఎవరెలా ఉంటే నాకేంటి? అని కాకుండా గ్రామంలో విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణానికి పాటుపడి ఆదర్శంగా నిలిచారు. ఆయనే కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో మారుమూల మారేడుమాక గ్రామానికి చెందిన సూరపనేని రామబ్రహ్మం.

ఆలోచన వచ్చిందిలా..

గత 45 ఏళ్లుగా విజయవాడలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన రామబ్రహ్మం.. గ్రామాభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ముందువరుసలో ఉంటారు. తన చిన్నతనంలో గ్రామానికి విద్యుత్తు, రహదారుల సౌకర్యం లేదు. చీకట్లోనే చదువుకొని బురద రహదారిలో నడక సాగించేవారు. ఈ దుస్థితే ఆయనను కలిచి వేసింది. అవకాశం వచ్చినప్పుడు గ్రామానికి ఎలాగైనా మేలు చేయాలని భావించారు. కొందరు గ్రామస్థులు కూడా విద్యుత్తు ఉపకేంద్రం కావాలని కోరారు. దీంతో తనకు పరిచయమున్న ట్రాన్సుకో ఉన్నతాధికారులతో తన ఆలోచనను పంచుకున్నారు. అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పిస్తామని తన గ్రామానికే కేటాయించాలని కోరారు. ఈ మేరకు తనతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారంతో సుమారు రూ.24 లక్షలు విలువైన 34 సెంట్ల స్థలం విరాళంగా ఇవ్వడమే కాకుండా సుమారు రూ.6 లక్షలతో మెరకు చేయించి పరికరాల అమర్పు, కార్యాలయ భవనం నిర్మాణానికి అనుకూలంగా తయారు చేశారు. దీంతో ప్రభుత్వం రూ.6.6 కోట్ల వ్యయంతో ఉపకేంద్రం నిర్మాణం పూర్తి చేసింది. దీనిని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఇటీవలే ప్రారంభించారు.

కుటుంబ సభ్యులతో దాత రామబ్రహ్మం  

 

చిన్నతనంలో చీకట్లో చదుకున్నాం..

చిన్నతనంలో తామంతా చీకట్లో చదువుకుని మట్టిదారుల్లో కాలువలు దాటుకుని వెళ్లే పరిస్థితి ఉండేది. గ్రామంలో ఎటువంటి ఉపాధి ఉండేది కాదు. బాగా చదువుకుని గ్రామానికి ఉపయోగపడాలనే తల్లిదండ్రుల చెప్పే మాటలకు కుటుంబ సభ్యులంతా స్ఫూర్తి పొంది  విద్యుత్తు ఉపకేంద్రానికి స్థలం విరాళంగా వచ్చాం. ఇందుకు గ్రామస్థులు సహకారం అందించారు. ఉపకేంద్రం నిర్మాణంతో పలువురికి ఉద్యోగాలు రావడంతో పాటు ఈప్రాంతంలో చిన్నతరహా పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది.

డాక్టర్‌ రామబ్రహ్మం


సేవలు స్ఫూర్తిదాయకం

- బోడే ప్రసాద్, ఎమ్మెల్యే

గ్రామాభివృద్ధిలో డాక్టర్‌ రామబ్రహ్మంతో పాటు నాగేశ్వరరావు, గంగాధరరావు, పూర్ణచంద్రరావు, మురళీ తదితరులు కృషి చేశారు. నియోజకవర్గంలో ఇంకా ఆరు ఉపకేంద్రాల నిర్మాణం సకాలంలో పూర్తయ్యే విధంగా కృషి చేస్తా. తద్వారా నాణ్యమైన విద్యుత్తు నిరంతరం సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది.


11 గ్రామాలకు మేలు

-మురళీమోహన్, ఎస్‌ఈ, ట్రాన్సుకో

మారేడుమాకలో 33/11 ఉపకేంద్రం నిర్మాణం ద్వారా 11 గ్రామాల్లోని 3,197 మంది గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిర్మాణం వెనుక డాక్టర్‌ రామబ్రహ్మం కృషి ఎంతైనా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని