logo

హత్య చేయించింది భార్యే

ఇటీవల స్థానికంగా కలకలం రేకెత్తించిన బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందులో సూత్రధారి అతడి భార్యే అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది.

Published : 10 Jul 2024 05:51 IST

ప్రియుడితో కలిసి పథక రచన
నలుగురు నిందితుల అరెస్టు
వీడిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ వెంకటేశ్వరరావు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ఇటీవల స్థానికంగా కలకలం రేకెత్తించిన బంటుమిల్లి మండలానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందులో సూత్రధారి అతడి భార్యే అని పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యింది. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే భర్త తన అక్రమ సంబంధానికి అడ్డు పడతాడన్న కారణంతో ప్రియుడితో కలిసి పథకం ప్రకారం అతడిని ఆమే హత్య చేయించినట్టు తేలింది. ఈ కేసులో ఓ మైనర్‌తో పాటు మరో నలుగురు నిందితులను గుర్తించి వారిలో నలుగుర్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిందితులను చూపించిన ఏఎస్పీ జి.వెంకటేశ్వరరావు.. ఈ సంఘటన వివరాలు వెల్లడించారు.

బంటుమిల్లి మండలం జానకిరామపురం గ్రామానికి చెందిన చిగురుశెట్టి సుభాష్‌చంద్రబోస్‌(42), శిరీష భార్యా భర్తలు కాగా.. భర్త ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో భర్త వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఆమె ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటూ కొంత కాలంగా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేయాలని సుభాష్‌ చంద్రబోస్‌ భావిస్తున్న నేపథ్యంలో.. అదే జరిగితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన శిరీష భర్తను అంతమొందించేందుకు ప్రియుడు పరుశురామయ్యతో పథకం పన్నింది. హత్యకు మరికొందరి సహకారంతో ప్రణాళిక రూపొందించుకున్న పరశురామయ్య.. ఈ నెల 5న ఉల్లిపాయలు కావాలంటూ ఓ బాలుడితో సుభాష్‌ చంద్రబోస్‌కు ఫోన్‌ చేయించాడు. దీంతో రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో ఉల్లిపాయల మూటలు వేసుకుని నారాయణపురం శ్మశానవాటిక పరిసరాలకు వచ్చిన బోస్‌పై అక్కడే పొంచి ఉన్న పరశురామయ్యతో పాటు నిడమర్రు మండలం భువనపల్లికి చెందిన కెల్లా హేమంత్‌కుమార్, భీమవరానికి చెందిన కోడిగుడ్లు మౌళిలు ఐరన్‌ పైపు, గాలి పంపుతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు  : హత్య కేసు మిస్టరీని త్వరగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న పెడన సీఐ నాగేంద్రప్రసాద్, బంటుమిల్లి ఎస్సై వాసు, గూడూరు ఎస్సై వీర్రాజు, ఇతర సిబ్బందిని అభినందించిన ఎస్పీ నగదు రివార్డుల ప్రకటించగా వాటిని ఏఎస్పీ ప్రదానం చేశారు.

మలుపు తిప్పిన సైకిల్‌ గాలిపంపు

రహదారి ప్రమాదం వల్ల సుభాష్‌ చంద్రబోస్‌ గాయపడినట్టు తొలుత భావించినా సంఘటనా ప్రదేశంలో రక్తపు మరకలతో ఉన్న గాలిపంపు ఉండడంతో హత్యాయత్నం జరిగినట్టు తేలింది. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం, మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంటుమిల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తునకు ఎస్పీ నయీమ్‌అస్మి ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో గ్రామస్థులతో పాటు ఆమె కుటుంబానికే చెందిన కీలక వ్యక్తులు శిరీష నడవడిక గురించి చెప్పిన విషయాల ఆధారంగా వివరాలు సేకరించడంతో ఆమే సూత్రధారి అన్న విషయం వెలుగుచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని