logo

బైపాస్‌లో హెచ్‌టీ విద్యుత్తు లైన్ల మార్పిడి

గొల్లపూడి-చినఅవుటపల్లి బైపాస్‌ రోడ్డు ఏర్పాటు నేపథ్యంలో హైటెన్షన్‌ విద్యుత్తు లైన్ల మార్పిడి పనులు చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయబద్ధమైన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

Published : 10 Jul 2024 05:40 IST

న్యాయబద్ధ పరిహారానికి రైతుల డిమాండ్‌
ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే

పొలాల్లో విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు

గొల్లపూడి-చినఅవుటపల్లి బైపాస్‌ రోడ్డు ఏర్పాటు నేపథ్యంలో హైటెన్షన్‌ విద్యుత్తు లైన్ల మార్పిడి పనులు చేపట్టారు. ఈక్రమంలో విజయవాడ గ్రామీణ మండలం జక్కంపూడి, గొల్లపూడి గ్రామాలకు చెందిన రైతులు తమకు న్యాయబద్ధమైన నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. టవర్ల నిర్మాణాలకు ప్రస్తుత ప్రభుత్వ ధర కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు తీగలు ఉన్న కారిడార్‌ ప్రాంతానికి 10 శాతం మాత్రమే ఇస్తామంటున్నారు. విజయవాడకు తమ గ్రామాలు అత్యంత సమీపంగా ఉండడం, ఇది రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ భూములు చాలా విలువైనవని రైతులు పేర్కొంటున్నారు. టవర్లు ఏర్పాటు చేసే భూమితో పాటు, తీగలు వెళ్లే కారిడార్‌కు కూడా 5 రెట్లు (500 శాతం హెచ్చు) ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ తరుణంలో 132 కేవీ విద్యుత్తు లైన్ల మార్పిడికి, వీరులపాడు, చందర్లపాడు, నందిగామ ప్రాంతంలో హెచ్‌టీ లైన్లకు 5 రెట్ల ధరను చెల్లించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జక్కంపూడిలో 57 మంది, గొల్లపూడిలో 30 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ ఇలా వివిధ కేటగిరీల్లో విద్యుత్తు లైన్లను గొల్లపూడి, జక్కంపూడి ప్రాంతాల్లో వేస్తున్నారు.

కలెక్టర్‌కు మైలవరం ఎమ్మెల్యే లేఖ

ఈ విషయమై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ బాధిత రైతుల తరఫున కలెక్టర్‌ జి.సృజనకు ఒక లేఖ రాశారు. రైతుల డిమాండ్ల ప్రకారం 5 రెట్ల మేర చెల్లింపులు చేయాలని కోరారు.

సర్వీసు రోడ్లకు వినతి

బైపాస్‌ రోడ్డును నిర్మిస్తున్న క్రమంలో సర్వీసు రోడ్లు వేయాలని రైతులు కోరుతున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో రాకపోకలకు వీలుగా సర్వీసు రోడ్లు ఎంతో అవసరమని గొల్లపూడి, జక్కంపూడి రైతులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని