logo

అడ్డగోలు ప్రతిపాదనలకు ఇక అడ్డుకట్టేనా?

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశాన్ని అధికార పక్షం ఇప్పటివరకు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తూ వచ్చింది. అడ్డగోలు ప్రతిపాదనలు ఆమోదించుకుంటూ పోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా, సీపీఎం కార్పొరేటర్లను సభను నుంచి సస్పెండ్‌ చేసి బయటకు గెంటేసింది.

Published : 10 Jul 2024 05:38 IST

ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తెదేపా, భాజపా ఎమ్మెల్యేలు
కౌన్సిల్‌ సమావేశం నేడు
న్యూస్‌టుడే, విజయవాడ నగరపాలక సంస్థ

విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశాన్ని అధికార పక్షం ఇప్పటివరకు తమకు ఇష్టమొచ్చినట్లుగా నిర్వహిస్తూ వచ్చింది. అడ్డగోలు ప్రతిపాదనలు ఆమోదించుకుంటూ పోయింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన తెదేపా, సీపీఎం కార్పొరేటర్లను సభను నుంచి సస్పెండ్‌ చేసి బయటకు గెంటేసింది. విపక్షాల ప్రతిపాదనలు తిరస్కరిస్తూ అన్నింటా తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించింది. కౌన్సిల్‌ సమావేశాలు వైకాపా శాసనసభ్యుల కనుసన్నల్లోనే జరిగేవి.

ప్రస్తుతం పరిస్థితి మారింది. వైకాపా పాలన స్థానే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఎన్డీయే ఎమ్మెల్యేలు కౌన్సిల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ పరిణామం పాలకవర్గానికి మింగుడు పడడం లేదు. ఏకపక్ష నిర్ణయాలకు వీలుపడదన్న భావన పాలకుల్లో నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాను కాదని ప్రతిపాదనలు, తీర్మానాలు ఆమోదించి అధికారులకు పంపినా, ప్రభుత్వానికి చేరినా వాటిని అమలు చేసే విషయంలో అడ్డంకులు తప్పవు. దీంతో ఇకపై ఎలా ముందుకు సాగాలన్న సమాలోచనలతో పాలకవర్గం మల్లగుల్లాలు పడుతోంది.

చాన్నాళ్ల తర్వాత..

ఎన్నికల కోడ్‌ అనంతరం 5 నెలల 10 రోజులకు మొదటి కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ క్రమంలో కౌన్సిల్లో ప్రస్తుతం వైకాపా ఎక్స్‌ అఫీషియో సభ్యుల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వైకాపాకు అనుకూలమైన ప్రతిపాదనలకు ఇక చెల్లుచీటీ పడనుంది. పాలకులు సాహసించి కౌన్సిల్‌ ముందుకు తెచ్చే ప్రజావ్యతిరేక ప్రతిపాదనలను కార్పొరేషన్, ప్రభుత్వ స్థాయిలో అడ్డుకునేందుకు విపక్షాలకు అవకాశం దొరికింది. దీంతో ఇక నుంచి కౌన్సిల్‌లో వారిదే పైచేయి కానుందన్న వాదన ఉంది. ఫలితంగా బుధవారం జరగనున్న కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ముందుకు ప్రజాసమస్యలు, ప్రత్యేక కమిటీల ప్రతిపాదనలు, సాధారణ ప్రతిపాదనలే ఎక్కవగా ప్రవేశపెడుతున్నారు.

తీర్మానాలపై ఉత్కంఠ..

విపక్షాల ప్రతిపాదిత అంశాలపై పాలకవర్గం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ తరహా తీర్మానాలు ఆమోదిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చెత్తపన్ను(యూజర్‌ ఛార్జీల) రద్దు ప్రతిపాదన, గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విలువ ఆధారిత ఆస్తిపన్ను ఉపసంహరణ, కార్పొరేటర్ల వార్డు బడ్జెట్‌ పెంపు, రక్షితనీటి సరఫరా, టిడ్కో ఇళ్ల కేటాయింపు, డయేరియా, అతిసారంతో మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు, విద్యాధరపురం వైకాపా కార్యాలయానికి కేటాయించిన స్థలం స్వాధీనం, అక్కడి నిర్మాణం ప్రజా ప్రయోజనాలకు వినియోగం వంటి ప్రతిపాదనలు, ఆప్కాస్‌ కార్మికుల వేతనాల పెంపు, ఆస్తి పన్ను విధింపులో లోపాల సవరణ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిపై పాలకపక్షం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తేలనుంది.

కమిషనర్‌ ప్రతిపాదనలు..

  • గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అప్పట్లో జరిగిన ఏపీ ఫైబర్‌నెట్‌కు సంబంధించిన అంశాలపై చర్చ, సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుతం కౌన్సిల్‌ ముందుకు తెస్తున్నారు. నగరంలో 37 జంక్షన్లు ఉండగా, 16 జంక్షన్లలో రూ.2.97 కోట్ల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ట్రాఫిక్‌ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, 21 జంక్షన్లలో నూతన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు టెండర్ల ఆమోదంతో పాటు, ఆ పనిని హైదరాబాద్‌ సంస్థకు అప్పగించారు. సంబంధిత ప్రతిపాదనకు మేయర్‌ ముందస్తు అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం కౌన్సిల్‌ ముందుకు ర్యాటిఫై కోసం పెడుతున్నారు.
  • 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.62 కోట్లతో నీటి సరఫరా, పారిశుద్ధ్య ప్రతిపాదనలకు మేయర్‌ ముందస్తు అనుమతి ఇవ్వగా, ఇప్పుడు ర్యాటిపై కోసం కౌన్సిల్‌ ముందుకు తెస్తున్నారు.
  • ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రతిపాదనలు సైతం అధికారుల ద్వారా కౌన్సిల్‌ ముందుకు తెస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని